శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా దడదడలాడించింది. సెంచరీల మోత మోగిస్తూ రికార్డు స్థాయి పరుగులు సాధించింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. రెండు ఫోర్లతో అలరించిన కెప్టెన్ బవుమా(8) కొద్దిసేపటికే వెనుదిరిగాడు. ఇక అప్పటినుంచి మొదలైంది బవుమా సేన ఎదురుదాడి. క్వింటన్ డికాక్(100; 84 బంతుల్లో, 12×4, 3×6), వాన్ డెర్ డసెన్(108; 110 బంతుల్లో, 13×4, 2×6) ఎడపెడా షాట్లు బాదారు. లంక బౌలర్లను ఉతికి ఆరేస్తూ రెండో వికెట్ కు 204 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించారు. రెండో వికెట్ గా డికాక్ ను వెనక్కు పంపామని సంబరపడ్డ లంక బౌలర్ల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అప్పుడు స్టార్ట్ అయింది మార్ క్రమ్(106; 54 బంతుల్లో, 14×4, 3×6) బ్యాటింగ్ తుపాను. గ్రౌండ్ కు అన్ని వైపులా ఫోర్లు బాదుతూ బౌలర్లకు అసహనం తెప్పించాడు. 34 బాల్స్ లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసిన మార్ క్రమ్.. మరో 15 బంతులు తీసుకుని కేవలం 49 బాల్స్ లోనే సెంచరీ మార్క్ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి పట్టిన 15 బాల్స్ లో 6 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయంటే నే ఈ ప్లేయర్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. క్లాసెన్(32), మిల్లర్(39) తలో చేయి వేయడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 రన్స్ చేసింది.
వరల్డ్ కప్ రికార్డులు
ముగ్గురు సౌతాఫ్రికా ప్లేయర్లు సెంచరీలు చేయగా.. వరల్డ్ కప్ లో ఒకే ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు(క్వింటన్ డికాక్, వాన్ డెర్ డసెన్, మార్ క్రమ్) రావడం ఇదే తొలిసారి. దీంతో వన్డే ప్రపంచకప్ లో అత్యధిక స్కోరు(428/5) చేసిన జట్టుగా సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. 2015 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా నెలకొల్పిన 415 రన్స్ రికార్డును ఆ జట్టు బ్రేక్ చేసింది. అటు మార్ క్రమ్ సైతం రికార్డ్ క్రియేట్ చేశాడు. 49 బంతుల్లోనే సెంచరీ చేసి వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ శతకం చేసిన క్రికెటర్ గా నిలిచాడు.