
వరుసగా రెండు వన్డేల్లో ఓడిన దక్షిణాఫ్రికా.. మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో తొలుత సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 338 పరుగులు చేసి.. 34.3 ఓవర్లలో 227 రన్స్ కే ఆస్ట్రేలియాను కట్టడి చేసి 111 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే చుక్కలు చూపించారు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు. మిడిలార్డర్ బ్యాటర్ ఎయిడెన్ మార్ క్రమ్(102; 74 బంతుల్లో, 9×4, 4×6) సెంచరీతో దుమ్ము దులపడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించింది. ఫోర్లు, సిక్స్ లతో మార్క్ క్రమ్ టీ20 గేమ్ ను గుర్తుకు తెచ్చాడు. అంతకుముందు ఓపెనర్లు క్వింటన్ డికాక్(82; 77 బంతుల్లో, 10×4, 2×6), కెప్టెన్ టెంబా బవుమా(57; 62 బంతుల్లో, 6×4) హాఫ్ సెంచరీలతో సౌతాఫ్రికాకు గొప్ప ఆరంభం లభించింది. తొలి వికెట్ కు 146 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించడంతో ఆసీస్ జట్టు డిఫెన్స్ లో పడిపోయింది. రీజా హెన్రిక్స్(39), మార్కో జాన్సెన్(32) రాణించారు. జోష్ హేజిల్ వుడ్ 9 ఓవర్లలో 74, నాథన్ ఎలిస్ 10 ఓవర్లలో 69, తన్వీర్ సంగా 8 ఓవర్లలో 64, సీన్ అబాట్ 3 ఓవర్లలో 31 రన్స్ సమర్పించుకున్నారంటేనే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కంగారూ బౌలర్లలో ట్రావిస్ హెడ్ 2, స్టాయినిస్, ఎలిస్, సంగా ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
339 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆసీస్.. ఓపెనర్ డేవిడ్ వార్నర్(78; 56 బంతుల్లో, 10×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించడంతో మంచి స్కోరు దిశగానే సాగుతున్నట్లు కనిపించింది. 140 స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 165కు చేరుకునేసరికి 4 వికెట్లు చేజార్చుకుంది. వార్నర్ రనౌట్ కాగా.. హెడ్(38), మార్ష్(29), లబుషేన్(15), క్యారీ(12), స్టాయినిస్(10), టిమ్ డేవిడ్(8) ఇలా అంతా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లు తీసుకోగా.. షంసీ, మహరాజ్ రెండేసి చొప్పున, మగాలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. సెంచరీ చేసి జట్టును గెలిపించిన మార్ క్రమ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కగా.. 5 మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1 లీడ్ తో ఉంది.