బాల్.. కింది నుంచి వెళ్తే ఫోర్, పై నుంచి వెళ్తే సిక్స్. ఇక ఇంకోమాటకు తావు లేదు అన్న చందంగా సాగింది సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన దక్షిణాఫ్రికా.. అదే రీతిలో కంటిన్యూగా రెండింట్లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. క్లాసెన్ విజృంభణతో కంగారూలు నిజంగానే కంగారులో పడిపోయారు. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని దారుణంగా చిత్తు చేసింది. సెంచూరియన్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్.. ఆతిథ్య జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 416 పరుగుల భారీ స్కోరు చేయగా.. 34.5 ఓవర్ల లో కంగారూలను 252 రన్స్ కు ఆలౌట్ చేసి 164 రన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
క్వింటన్ డికాక్(45), రీజా హెండ్రిక్స్(28) ఫర్వాలేదనిపించారు. తర్వాత రసీ వాన్ డెర్ డసెన్(62; 65 బంతుల్లో, 7×4, 2×6) హాఫ్ సెంచరీ చేయగా.. మార్ క్రమ్(8) రన్స్ కే వెనుదిరిగాడు. ఇక అప్పుడు మొదలైంది.. హెన్రిచ్ క్లాసెన్ తుపాను. అది తుపానో, సునామో తెలియదు కానీ బాల్ వేయడమే పాపం.. స్టాండ్స్ లో పడటమో, బౌండరీ లైన్ ను ముద్దాడటమో జరిగిపోయాయి. కేవలం 83 బాల్స్ లోనే భారీ సెంచరీ సాధించాడాతడు. క్లాసెన్(174; 83 బంతుల్లో, 13×4, 13×6) ఫోర్స్, సిక్స్ లతోనే 130 రన్స్ చేశాడంటే ఎంత మెరుపు వేగంతో ఇన్నింగ్స్ సాగిందో అర్థం చేసుకోవచ్చు. అటు డేవిడ్ మిల్లర్(82; 45 బంతుల్లో, 6×4, 5×6) సైతం చుక్కలు చూపించాడు. 194 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన జట్టును ఐదో వికెట్ కు ఈ ఇద్దరూ రికార్డు స్థాయిలో 222 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించారు. 200 స్ట్రైక్ రేట్ తో ఈ జోడీ సాగించిన దాడితో ఆసీస్ బౌలర్లు బిత్తరపోయారు. స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో 113 రన్స్ ఇవ్వగా.. స్టాయినిస్ 10 ఓవర్లలో 81, నాథన్ ఎలిస్, హేజిల్ వుడ్ 10 ఓవర్లలో 79 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా.. పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. కీపర్ అలెక్స్ క్యారీ(99; 77 బంతుల్లో, 9×4, 4×6) సెంచరీ మిస్ కాగా.. ఆసీస్ బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. వార్నర్(12), హెడ్(17), మార్ష్(6), లబుషేన్(20), స్టాయినిస్(18), టిమ్ డేవిడ్(35) టాప్, మిడిలార్డర్ అంతా తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో ఆసీస్ కథ క్లోజ్ అయింది. ఈ మ్యాచ్ లో మొత్తం 31 సిక్స్ లు నమోదు కాగా.. అందులో దక్షిణాఫ్రికా 20, ఆసీస్ 11 చేశాయి. ఎంగిడి 4, రబాడ 3 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు.