వన్డే ప్రపంచకప్ లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్ లో ధారాళంగా పరుగులు వచ్చాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 రన్స్ చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 44.5 ఓవర్లలో 326 రన్స్ కు లంక ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 102 పరుగులతో విజయం సాధించింది. కెప్టెన్ బవుమా(8) ఔటైనా డికాక్(100; 84 బంతుల్లో, 12×4, 3×6), వాన్ డెర్ డసెన్(108; 110 బంతుల్లో, 13×4, 2×6) రెండో వికెట్ కు 204 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించారు. డికాక్ ఔట్ కాగానే మార్ క్రమ్(106; 54 బంతుల్లో, 14×4, 3×6) బ్యాటింగ్ తుపాను మొదలైంది. 34 బాల్స్ లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసిన మార్ క్రమ్.. మరో 15 బంతులు తీసుకుని కేవలం 49 బాల్స్ లోనే సెంచరీ మార్క్ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి పట్టిన 15 బాల్స్ లో 6 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయంటేనే ఆ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థమవుతుంది. క్లాసెన్(32), మిల్లర్(39) రాణించారు.
దంచికొట్టిన కుశాల్
ఓపెనర్లిద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా కుశాల్ మెండిస్(76; 42 బంతుల్లో, 4×4, 8×6) సిక్స్ లతో హోరెత్తించాడు. చరిత్ అసలంక(79), దసున్ శానక(68) ఆకట్టుకున్నా భారీ లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కోయెట్జీ 3, జాన్సెన్, రబాడ, మహరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మార్ క్రమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.
వరల్డ్ కప్ రికార్డులు
ముగ్గురు సౌతాఫ్రికా ప్లేయర్లు సెంచరీలు చేయగా.. వరల్డ్ కప్ లో ఒకే ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు(క్వింటన్ డికాక్, వాన్ డెర్ డసెన్, మార్ క్రమ్) రావడం ఇదే తొలిసారి. దీంతో వన్డే ప్రపంచకప్ లో అత్యధిక స్కోరు(428/5) చేసిన జట్టుగా సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. 2015 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా నెలకొల్పిన 415 రన్స్ రికార్డును ఆ జట్టు బ్రేక్ చేసింది. అటు మార్ క్రమ్ సైతం రికార్డ్ క్రియేట్ చేశాడు. 49 బంతుల్లోనే సెంచరీ చేసి వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ శతకం చేసిన క్రికెటర్ గా నిలిచాడు.