
ఓపెనర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) మరోసారి భారీ సెంచరీ సాధించడంతోపాటు హెన్రిచ్ క్లాసెన్ తుపాను సృష్టించడంతో దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడింది. ఈ ఇద్దరి సునామీ ఇన్నింగ్స్ తో ఆ జట్టు మరోసారి భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 రన్స్ స్కోరు చేసింది. 46.4 ఓవర్లలో 233 రన్స్ బంగ్లా ఆలౌట్ కావడంతో 149 పరుగుల ఆధిక్యంతో సౌతాఫ్రికా విజయం సాధించింది. డికాక్(174; 140 బంతుల్లో 15×4, 7×6), క్లాసెన్(90; 49 బంతుల్లో 2×4, 8×6) సిక్స్ లతో బంగ్లా బౌలింగ్ ను చీల్చిచెండాడారు. డికాక్ నిలిచినా మరో ఎండ్ లో హెండ్రిక్స్(12), వాండెర్(1) వెంటవెంటనే అవుటయ్యారు. ఈ దశలో క్రీజులోకొచ్చిన మార్ క్రమ్(60; 69 బంతుల్లో 7×4), క్లాసెన్ అండతో డికాక్ దుమ్ముదులిపాడు. చివర్లో మిల్లర్ కూడా(34; 15 బంతుల్లో 1×4, 4×6) బ్యాట్ కు పనిచెప్పడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది.
బంగ్లా వికెట్లు టపటపా, మహ్మదుల్లా సెంచరీ వృథా
అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోగా.. 58 రన్స్ చేరుకునేసరికి 5 వికెట్లు చేజార్చుకుంది. మహ్మదుల్లా(111; 111 బంతుల్లో 11×4, 4×6) సెంచరీ చేసినా అప్పటికే బంగ్లా ఓటమి ఖాయమైపోయింది. తొలుత జాన్సన్, విలియమ్స్, కోయెట్జీ, రబాడ ధాటికి చకచకా వికెట్లు కోల్పోయింది. తాంజిద్(12), లిటన్(22), శాంటో(0), కెప్టెన్ షకిబుల్(1), ముష్ఫికర్(8) ఇలా టాప్-5 బ్యాటర్లు క్రీజులో కుదురుకోకుండానే ఔటవడంతో బంగ్లా పరాజయం ఖరారైంది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా మహ్మదుల్లా మాత్రం సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొని సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కోయెట్జీ 3, జాన్సన్, విలియమ్స్, రబాడ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. క్వింటన్ డికాక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.