
చెన్నై చెపాక్ స్టేడియంలో భారత స్పిన్నర్ల(Spinners) హవా కొనసాగింది. జడేజా, కుల్దీప్, అశ్విన్ త్రయానికి ఆస్ట్రేలియా పెద్దగా స్కోరు చేయకుండానే తోక ముడిచింది. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్-5లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత స్పిన్ ధాటికి విలవిల్లాడింది. 49.3 ఓవర్లలో 199 రన్స్ కు ఆలౌటయింది. కంగారూ టీమ్ లో ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ మార్క్ ను చేరుకోలేదు. ఓపెనర్ మిచెల్ మార్ష్(0) బుమ్రా బాల్ కు డకౌట్ కాగా.. ఫామ్ కొనసాగిస్తున్న మరో ఓపెనర్ వార్నర్(41) ఫర్వాలేదనిపించాడు. స్లిప్ లో కోహ్లి అద్భుతంగా డైవ్ చేసి మార్ష్ క్యాచ్ అందుకున్నాడు. స్మిత్(46)తో కలిసి రెండో వికెట్ కు 69 రన్స్ జోడించిన అనంతరం వార్నర్ ను కుల్దీప్ ఔట్ చేశాడు. కొద్ది సేపు క్రీజులో నిలిచిన లబుషేన్(27) సైతం పెద్దగా స్కోరు చేయకుండానే వెనుదిరిగాడు.
మిడిలార్డర్ టపటపా
ఆస్ట్రేలియా రన్ రేట్ 4కే పరిమితం కాగా.. కొన్ని ఓవర్లలో మాత్రమే 5కు చేరుకుంది. స్మిత్, లబుషేన్, అలెక్స్ క్యారీ(0) ముగ్గురినీ జడేజా ఔట్ చేశాడు. మ్యాక్స్ వెల్(15) ను కుల్దీప్, గ్రీన్(8)ని అశ్విన్ బుట్టలో వేసుకున్నారు. 4 వికెట్లకు 119 స్కోరుతో కనిపించిన కంగారూ జట్టు… 140కి చేరుకునే సరికి 7 వికెట్లు చేజార్చుకుంది. మెయిన్ బ్యాటర్లంతా ఒకరి వెంట మరొకరు క్యూ కట్టడంతో ఆస్ట్రేలియా నుంచి ప్రతిఘటనే లేకుండా పోయింది. స్పిన్ దాడితో పూర్తి డిఫెన్స్ లో పడిపోయిన కమిన్స్ సేన.. ఏ దశలోనూ బ్యాట్లకు పని చెప్పలేదు. కమిన్స్(15), స్టార్క్(28) చివర్లో భారత బౌలర్లను కాసేపు అడ్డుకున్నారు. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకోగా.. కుల్దీప్, బుమ్రా రెండేసి వికెట్ల చొప్పున, అశ్విన్, పాండ్య, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.