
వర్షం పడుతుందేమో అనుకుని చాలా మంది ఇంకా టీవీలు కూడా ఆన్ చేసి ఉండరేమో. ఎందుకంటే ఆసియా కప్ మొదలైనప్పటి నుంచీ కొలంబోలో వర్షాలే వర్షాలు కదా. పైగా ఈ మ్యాచ్ కూ వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ కూడా ముందే ప్రకటించింది. వన్డే కదా.. మెల్లగా చూద్దాంలే అని అనుకుని ఉంటారేమో. కానీ టీవీలు ఆన్ చేసిన 20 నిమిషాలకే ఆశ్చర్యకరమైన ఆట కళ్లకు కనపడింది. సొంతగడ్డపై భారీ స్కోరు చేసి భారత్ కు సవాల్ విసురుతుందని భావించిన లంక.. దారుణమైన రీతిలో 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 6.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(23), శుభ్ మన్ గిల్(27) ఇన్నింగ్స్ ను ముగించారు. దీంతో ఆ జట్టుకు ఘెర పరాభవం మిగిలింది. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో గెలిచి ఆసియా కప్ ను భారత్ ఎనిమిదో సారి గెలుచుకుంది.
ఆట మొదలయ్యాక ఫస్ట్ మూడు ఓవర్లకే సగం వికెట్లను శ్రీలంక కోల్పోయింది. తొలి ఓవర్ మూడో బంతికే తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు.. మూడో ఓవర్లో సిరాజ్ దెబ్బకు విలవిల్లాడింది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. సిరాజ్ విసిరిన ఫస్ట్ బాల్ ఆడి నిశాంక.. పాయింట్ లో జడేజా అద్భుత క్యాచ్ కు అవుటయ్యాడు. రెండో బాల్ డిఫెన్స్ ఆడిన సమరవిక్రమను మూడో బంతికి బుట్టలో వేసుకున్నాడు. LBWగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించగా సమరవిక్రమ రివ్యూ కోరినా ఫలితం లేకుండా పోయింది. సిరాజ్ నాలుగో బాల్ కు అసలంక కవర్స్ లో ఇషాన్ కు దొరికిపోయాడు. ఐదో బాల్ కు ఫోర్ కొట్టిన ధనంజయ… ఆ ఓవర్ చివరి బంతిని ఆడితే అది డైరెక్ట్ గా కీపర్ రాహుల్ చేతుల్లో పడింది. ఇంకేముంది.. మూడు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి శ్రీలంక స్కోరు 12/5.
మిడిలార్డర్, టెయిలెండర్స్ ఇలా ఎవరూ నిలదొక్కుకోకపోవడంతో 50 పరుగులకే శ్రీలంక చాప చుట్టేసింది. సిరాజ్ మొత్తం 6 వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. అటు హార్దిక్ పాండ్య సైతం 3 వికెట్లు తీసి లంక వెన్నువిరిచాడు. బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. ఐదుగురు శ్రీలంక బ్యాటర్లు డకౌట్ గా వెనుదిరిగారు. తొమ్మిది గంటల పాటు సాగాల్సిన మ్యాచ్.. కేవలం గంటన్నరలోనే క్లోజ్ అవడం క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది.