Published 27 Dec 2023
121 స్కోరుకే 6 వికెట్లు కోల్పోయి 11 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉండి టెయిలెండర్లను నిలబెట్టుకుంటూ సెంచరీ చేయడమంటే మామూలు మాటలు కాదు. అలాంటి పోరాటానికి బాటలు పరవడమే కాదు.. ఏకంగా సెంచరీ చేసి చివరి వికెట్ గా ఔటైన తీరు కేఎల్ రాహుల్ ఆటకు నిదర్శనంగా నిలిచింది. కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కిస్తూ ఒంటరిపోరాటంతో గౌరవప్రద స్కోరును అందించిన రాహుల్(101; 137 బంతుల్లో 14×4, 4×6)తో సెంచూరియన్ పార్కులో తన మార్క్ ను క్రియేట్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 208/8తో ఉన్న టైమ్ లో వరుణుడి ప్రభావం వల్ల ఫస్ట్ డే ఆటను ముగించిన టీమ్ ఇండియా.. రెండో రోజు తొలి సెషన్(First Session)లో మరో 37 రన్స్ జోడించి ఆలౌటైంది.
సిక్స్ లతో సెంచరీ
చివర్లో బుమ్రా(1), సిరాజ్(5), ప్రసిద్ధ్ కృష్ణ(0) ఔటవడంతో రాహుల్ సెంచరీపై అనుమానాలు ఏర్పడ్డాయి. 85 స్కోరు వద్ద ఫోర్ బాది 89కి చేరుకున్న KL.. ఇంకో రెండు డాట్ బాల్స్ తర్వాత సిక్స్ బాది 95కి రీచ్ అయ్యాడు. తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్ కే సిరాజ్ ఔట్ తో తొమ్మిదో వికెట్ పడ్డ పరిస్థితుల్లో కొయెట్జీ బౌలింగ్ లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆడిన పదో బంతికే రాహుల్ బౌల్డయ్యాడు. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ లో జైస్వాల్(17), రోహిత్(5), గిల్(2), కోహ్లి(38), శ్రేయస్(31), రవిచంద్రన్ అశ్విన్(8), శార్దూల్(24) పరుగులు చేశారు. రబాడ 5, బర్గర్ 3, యాన్సన్, కొయెట్జీ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.