వరుణుడి అంతరాయంతో ఆగుతూ.. సాగుతూ.. నడిచిన మ్యాచ్ లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. దాయాది దేశం పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తమది ప్రపంచంలోనే టాప్ బౌలింగ్ అని చెప్పుకునే పాక్ బౌలర్లను ఉతికి ఆరేశారు. నిన్న మధ్యలోనే ఆగిపోయిన ఆసియా కప్ పోరును ఈ రోజు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ కావాల్సి ఉన్నా పొద్దున్నుంచి కంటిన్యూగా వర్షం పడటంతో సాయంత్రం 4:40 గంటలకు ఆట మొదలైంది. 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. KL రాహుల్, విరాట్ కోహ్లి విరుచుకుపడటంతో భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ స్టార్ అయిన తొలి ఐదారు ఓవర్ల వరకు స్లోగా ఆడిన ఈ జంట.. ఆ తర్వాత జోరు పెంచింది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్.. ప్రత్యర్థి బౌలర్లందరిపైనా ఆధిపత్యం చెలాయించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్ లతో తేరుకోకుండా చేశాడు. తొలుత మెల్లగా రన్స్ తీసిన కోహ్లి సైతం తానేం తక్కువ కాదన్నట్లు రెచ్చిపోయాడు. తొలిరోజు రోహిత్, గిల్ ధాటిగా ఆడితే రెండో రోజు ఆటలో రాహుల్, కోహ్లి వీరవీహారం చేశారు.
ఇలా ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడంతో భారత్ ఇన్నింగ్ మొత్తం 6 రన్ రేట్ పైగా సాగింది.. రాహుల్ 60 బాల్స్ లో 5×4, 1×6తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కోహ్లి 55 బంతుల్లోనే 5×4తో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. ఈ జంట వన్డేల్లో 1,000 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. వీరిద్దరి దూకుడుతో 45 ఓవర్లలోనే భారత్ 300 పరుగుల మార్క్ రీచ్ అయింది. 100 బాల్స్ లో KL సెంచరీ పూర్తి చేసుకుంటే కోహ్లికి మాత్రం కేవలం 84 బంతులే అవసరమయ్యాయి. వన్డేల్లో కోహ్లి 47వ శతకాన్ని పూర్తి చేసుకుని.. సచిన్ టెండూల్కర్(49)కు మరో రెండు సెంచరీల దూరంలోనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి 179 బంతుల్లోనే 200 పరుగుల పార్ట్నర్ షిప్ జోడించారు. షహీన్ షా అఫ్రిది తన 10 ఓవర్ల స్పెల్ లో 79 రన్స్ ఇచ్చాడంటే అతణ్ని ఏ విధంగా ఉతికి ఆరేశారో తెలుసుకోవచ్చు.
ఫైనల్ గా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లకు 356 పరుగులు భారీ స్కోరు సాధించింది. రోహిత్(56; 49 బంతుల్లో, 6×4, 4×6), గిల్(58; 52 బంతుల్లో, 10×4, 4×6), కోహ్లి(122 నాటౌట్; 94 బంతుల్లో, 9×4, 3×6), కేఎల్(111 నాటౌట్; 106 బంతుల్లో, 12×4, 2×6) దుమ్మురేపారు. రాహుల్, కోహ్లి 194 బాల్స్ లో 233 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అఫ్రిది, షాదాబ్ తలో వికెట్ తీసుకున్నారు. 10 ఓవర్ల స్పెల్ లో అఫ్రిది(79) , ఫహీమ్(74), షాదాబ్(71) రన్స్ సమర్పించుకున్నారు.