నరాలు తెగే ఉత్కంఠ(High Tension)లో బరువెక్కిన హృదయాలకు సాంత్వన(Relief) ఇచ్చేలా సూర్యకుమార్ పట్టిన క్యాచ్.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. అప్పటికే సిక్స్, ఫోర్ తో దూకుడుగా ఉన్న మిల్లర్ కొట్టిన షాట్ ను ఆపి.. కాలుకు బౌండరీ లైన్ తగలకుండా పట్టిన క్యాచ్ తరాలపాటు గుర్తుండిపోతుంది. బార్బడోస్ తాజా క్యాచ్ 1983 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ ను ఓడించిన క్యాచ్ ను గుర్తుకు తెచ్చింది.
ఎలా అంటే…
రెండుసార్లు జగజ్జేత అయిన విండీస్ ను అండర్ డాగ్ గా బరిలోకి దిగిన కపిల్ సేన ఓడించి కప్పును అందుకుంది. కెప్టెన్ కపిల్ దేవ్ ఆ రోజు ఆటలో వివ్ రిచర్డ్స్ క్యాచ్ ను అందుకున్న తీరు అమోఘం. రిచర్డ్స్ కొట్టిన బాల్ ను అందుకునేందుకు మిడాన్(Mid-On) నుంచి పరుగెత్తుకొచ్చి ఎవరూ ఊహించని రీతిలో చేతుల్లో ఒడిసిపట్టాడు.
మదన్ లాల్ వేసిన ఆ డెలివరీ బ్యాట్ టాప్ ఎడ్జ్ కు తగిలి గాల్లోకి లేస్తే.. అసాధ్యమైన క్యాచ్ ను మిడాన్ నుంచి వెనక్కు పరుగెడుతూ తీసుకోవడంతో వెస్టిండీస్ 140కే చాపచుట్టేసింది. దీంతో తొలి వరల్డ్ కప్ అందుకోవడం ద్వారా భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ఏర్పడింది.