17 ఏళ్ల నిరీక్షణ(Waiting)కు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్ కప్ తుది మెట్టు(Final)పై బోల్తా పడ్డ చేదు జ్ఞాపకాన్ని మరచి అద్భుత ఆటతీరుతో పొట్టి ఫార్మాట్లో(T20) ప్రపంచకప్ ను అందుకుంది. ఎప్పుడో 2007లో అరంగేట్ర కప్పును సొంతం చేసుకున్న టీమ్ఇండియా.. ఇన్నాళ్లకు అప్రతిహత విజయాలతో మళ్లీ విజేతగా నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కోహ్లి(76; 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్(47; 31 బంతుల్లో 1×4, 4×6) పోరాటంతో 7 వికెట్లకు 176 స్కోరు చేసింది. ఈ పిచ్ పై జరిగిన అన్ని ఫైనల్స్ లోనూ టీమ్ఇండియా సాధించిందే అత్యధిక స్కోరు. మహరాజ్, నోకియా రెండేసి.. యాన్సన్, రబాడ తలో వికెట్ తీశారు.
తర్వాత ఇక…
177 టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 12 స్కోరుకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ హెన్రిక్స్(4), కెప్టెన్ మార్క్రమ్(4)… పేసర్లు బుమ్రా, అర్షదీప్ కు వికెట్లు ఇచ్చుకున్నారు. దూకుడుగా కనిపించిన స్టబ్స్(31; 21 బంతుల్లో 3×4, 1×6)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. డేంజరస్ గా మారిన డికాక్(39), క్లాసెన్(52) ఔట్ కావడంతో రోహిత్ సేన ఊపిరి పీల్చుకుంది.
అప్పటిదాకా టెన్షన్ తో మునివేళ్లపై నిలబడ్డ క్రికెట్ ప్రేమికులకు అద్భుత క్యాచ్ తో భారాన్ని దింపేశాడు సూర్యకుమార్ యాదవ్. హార్దిక్ పాండ్య 3, బుమ్రా, అర్షదీప్ రెండేసి.. అక్షర్ ఒక వికెట్ తీసుకున్నారు. ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లకు 169 వద్దే నిలిచిపోయిన సౌతాఫ్రికా.. 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.