ముంబయి సముద్ర తీరం మువ్వన్నెల జెండా రెపరెపలతో మురిసిపోయింది. అభిమానుల బ్రహ్మరథంతో కడలి తీరం నీలి వర్ణంతో నిగనిగలాడింది. వాన చినుకుల్ని కూడా లెక్కచేయక టీమిండియా ఆటగాళ్లకు జనమంతా అపూర్వ స్వాగతం పలికారు. లక్షలాదిగా తరలివచ్చిన క్రికెట్ ప్రేమికులతో ముంబయి మరోసారి ధగధగలాడింది.
ప్రధానితో భేటీ తర్వాత ఆటగాళ్లంతా ముంబయి వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ BCCI ఆతిథ్యం ముగిసిన తర్వాత ఓపెన్ టాప్ బస్సు ద్వారా మెరైన్ డ్రైవ్ నుంచి రోడ్ షో మొదలైంది. బస్సుపైకి ఎక్కిన ప్లేయర్లంతా అభిమానుల స్వాగతానికి పులకించిపోయారు. నారీమన్ పాయింట్ మీదుగా సాగిన రోడ్ షో.. జై భారత్ నినాదాలతో మార్మోగిపోయింది.
2007లో తొలి టీ20 కప్పును అందుకున్న భారత్.. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి కప్పును ముద్దాడింది. క్రికెట్ వీరుల ఘనతను గుర్తు చేసుకుంటూ 2 కిలోమీటర్ల పొడవునా ముంబయి వీధుల్లో ప్రజలు.. భారత జాతీయ పతాకాలను రెపరెపలాడించారు.