ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు పూర్తి అయోమయంలో చిక్కుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా ఫెయిలవుతున్న కెప్టెన్ రోహిత్ విషయంలో గందరగోళం ఏర్పడితే.. టీమ్ మేనేజ్మెంట్ వ్యవహారశైలీ ఇబ్బందికరంగా తయారైంది. కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్టర్లు, రోహిత్ మధ్య అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మూడు వర్గాల మధ్య సైద్ధాంతిక(Ideological) విభేదాలున్నట్లు(Differences) ప్రచారం జరుగుతోంది. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి ఆర్నెల్లవుతున్నా ఆశించిన రిజల్ట్స్ రాలేదు. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్ లో వైట్ వాష్ కు గురవడం, తాజా బోర్డర్-గవాస్కర్ టోర్నీలో 1-2తో వెనుకబడటం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
సరిగా ఆడని సీనియర్లపై గంభీర్ కోపంగా ఉన్నట్లు, ఇప్పటికే వారికి క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్లేస్ కే ఎసరు వస్తున్న పరిస్థితుల్లో రోహిత్, కోహ్లి బాగా ఆడకపోవడం గంభీర్ ఆగ్రహానికి కారణమైంది. రోహిత్, గిల్ లేకపోయినా తొలి టెస్టును బుమ్రా సారథ్యంలో గెలిచిన తీరుతో ప్రశంసలు వస్తే, రోహిత్ అడుగుపెట్టాక వాతావరణం పూర్తిగా మారిపోయింది. రోహిత్ వరుసగా విఫలమవడం, జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్న టైంలో కోహ్లి నిర్లక్ష్యంగా ఆడి అతణ్ని రనౌట్ చేయడం వంటి లోపాలతో జట్టుపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ స్థానాలపైనే అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదని, డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రావడం సరికాదని గంభీర్ వివరణ ఇచ్చుకున్నారు.