
Published 28 Nov 2023
టీ20 సిరీస్ లో భారత జట్టును ఆస్ట్రేలియా నిలువరించింది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ గెలవాలన్న కలను పెండింగ్ లో పెట్టింది. ఓపెనర్ రుతురాజ్(123; 57 బంతుల్లో 13×4, 7×6) సెంచరీ వృథా అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 3 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. చివరి బంతికి విజయాన్ని అందుకుంది. 6 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో తొలి బంతికి ఫోర్, రెండో బంతికి సింగిల్, మూడో బాల్ కు సిక్స్ వచ్చాయి. ఇక 3 బంతుల్లో 10 రన్స్ కావాల్సి ఉండగా.. నాలుగు, ఐదు బంతులకు ఫోర్లు రావడంతో చివరి బాల్ కు 2 రన్స్ అవసరమయ్యాయి. కానీ చివరి బాల్ కు మ్యాక్స్ వెల్ ఫోర్ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాక్స్ వెల్(104; 48 బంతుల్లో 8×4, 8×6)తో ఆసీస్ గెలుపు తీరాలకు చేరుకుంది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు సాధించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత్ ధనాధన్
భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్ దే కీలక ఇన్నింగ్స్. తొలుత నిదానంగా సాగిన ఆట తర్వాత గేరు మార్చి.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. యశస్వి(6), ఇషాన్(0) ఇద్దరూ త్వరగా ఔటై 80 స్కోరుకే 2 వికెట్లు పడిపోయినా కెప్టెన్ సూర్య, రుతురాజ్ జోడీ భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. సూర్యకుమార్(39; 29 బంతుల్లో 5×4, 2×6), తిలక్ వర్మ(31; 24 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. మ్యాక్స్ వెల్ ఒక్క ఓవర్ లోనే 30 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆస్ట్రేలియా తడబాటు
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ 68 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. హెడ్(35), హార్ది(16), ఇంగ్లిస్(10), స్టాయినిస్(17) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. కానీ మ్యాక్స్ వెల్ ఒంటరి పోరాటం చేశాడు. 18 బాల్స్ లో 49గా ఉన్న సమీకరణం.. 12 బంతుల్లో 43కు చేరుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ 18వ ఓవర్లో కేవలం 5 పరుగులే ఇవ్వడంతో ఆస్ట్రేలియా పూర్తి ఆత్మరక్షణలో పడిపోయింది. కానీ మ్యాక్స్ వెల్ ఆటతీరుతో ఆ జట్టుకు ఇబ్బందే లేకుండా పోయింది. 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.