ఆసియా కప్ గెలిచిన జోరులో ఒకరు… వరుసగా రెండు వన్డేలు నెగ్గినా చివరి మూడు మ్యాచ్ ల్లో ప్రత్యర్థి చేతిలో చిత్తుగా ఓడినవారు మరొకరు. ఇలా ఈ రెండు జట్లూ ఇప్పుడు సమరానికి సై అంటున్నాయి. వరల్డ్ కప్ కు సన్నాహకం(Trial)గా భావించే సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు అక్టోబరు 8న తలపడనుండగా.. కీలక ప్లేయర్లు గాయాల పాలు కావడం కంగారూ జట్టుకు ఇబ్బందికరంగా తయారైంది. చేయి విరగడంతో ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ కే దూరం కావడం ఆస్ట్రేలియా పెద్ద దెబ్బ. ట్రావిస్ ప్లేస్ లో మాథ్యూ షార్ట్ ను టీమ్ కు సెలెక్ట్ చేశారు. ఈ ఓపెనర్ కు స్పిన్ పై పట్టు ఉండటంతో భారత్ పిచ్ లపై రాణించగలడన్న అంచనాలున్నాయి. అటు టీమ్ఇండియా తరఫున అక్షర్ పటేల్ సైతం పూర్తి ఫిట్ గా లేడు. శ్రీలంకను 50 రన్స్ కే ఆలౌట్ చేసి భారీ గెలుపును సొంతం చేసుకున్న భారత్ పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపిస్తుండగా.. ఆసీస్ పరిస్థితి పూర్తి డిఫరెంట్ గా ఉంది. అయితే ఈ నెల 22, 24 తేదీల్లో జరిగే తొలి రెండు వన్డేలకు నలుగురు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతి ఇవ్వగా.. స్పిన్నర్లు అశ్విన్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తున్నారు.
ఈ సిరీస్ సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ గా కీలకంగా మారింది. వెన్ను నొప్పితో ఆసియా కప్ లో అయ్యర్ కు ఆడే అవకాశం దక్కలేదు. ఇక సూర్య మాత్రం బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 26 రన్స్ చేశాడు. అందుకే ఈ ఇద్దరిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక అశ్విన్ సైతం ఏడాదిన్నర కాలంగా వన్డేలకు దూరంగా ఉన్నాడు. హార్దిక్ లేకపోవడంతో ముగ్గురు స్పిన్ ఆల్ రౌండర్లతో భారత్ బరిలోకి దిగనుండగా ఓపెనర్ గా ఇషాన్ కిషన్.. గిల్ కు జోడీగా ఉంటాడు. ఈ మ్యాచ్ జరిగే మొహాలీ స్టేడియంలో గత నాలుగేళ్లుగా వన్డేలు నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు పిచ్ కండిషన్ పై ఇరు జట్లు అంచనాకు రాలేకపోతున్నాయి. అయితే కొన్ని IPL మ్యాచ్ ల్లో మాత్రం భారీ స్కోర్లు వచ్చాయి.