భారత్-పాక్ మ్యాచ్. అది ఏదయినా సరే.. ఆ మజాయే వేరు. ఇక క్రికెట్ గురించయితే చెప్పేదేముంటుంది. బాల్ బాల్ కు టెన్షన్, నరాలు తెగే ఉత్కంఠ, ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు ఆటకు హైలెట్ గా నిలుస్తాయి. అలాంటి మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ నేడే జరగనుంది. ఆసియా కప్ లో భాగంగా ఈ రెండు జట్లు చాలా కాలం తర్వాత తలపడుతున్నాయి. దాయాది దేశం పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే మన దేశ వాసులకే కాకుండా వరల్డ్ వైడ్ గా ఎంతో క్రేజ్ ఉంటుంది. మరోవైపు ఇరు జట్లలోనూ ఎంతో ప్రెజర్ ఉండటం సహజం.
ఇప్పటివరకు మనదే ఆధిపత్యం
ఇప్పటివరకు ఆసియా కప్ లో ఇరు జట్లు 17 సార్లు పోటీపడగా.. అందులో భారత్ 9 సార్లు, పాక్ 6 సార్లు విజయం సాధించాయి. మిగతా రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. శ్రీలంకలోనే పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. వర్షం అడ్డుపడే అవకాశముంది. క్రికెట్ ప్రియులు ఇప్పటికే పెద్దసంఖ్యలో టికెట్లు బుక్ చేసుకున్నారు.