టాస్ ఓడి అప్పుడే బ్యాటింగ్ కు దిగింది ముంబయి. క్రీజులో అత్యంత సీనియర్(Most Senior) రోహిత్ శర్మతోపాటు ఇషాన్ కిషన్ ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి మూడు బంతులు డాట్స్(Dots)గా పడ్డాయి. నాలుగో బాల్ కు సింగిల్ తీశాడు ఇషాన్.
ఇక రోహిత్ వంతు. ఐదో బాల్ ను ఆడబోతే అది కాస్తా ఎడ్జ్ తీసుకుంది. కీపర్ సంజూ శాంసన్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకోవడంతో రోహిత్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. అతడి స్థానంలో వచ్చిన నమన్ ధిర్(0) కూడా ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ కే ఎల్బీ(LBW)గా ఔటయ్యాడు. అలా ఫస్ట్ ఓవర్ కాస్తా ఒక రన్ రెండు వికెట్లుగా ముగిసిపోయింది.
రెండో ఓవర్లో 12…
రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ ఫోర్, సిక్స్ బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఇక తన రెండో ఓవర్ మొదలుపెట్టిన బౌల్ట్… డెవాల్డ్ బ్రెవిస్(0)ను సైతం బర్గర్ క్యాచ్ తో వెనక్కు పంపాడు. ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ ఆడిన తొలి బంతికే ఔటవడం ముంబయి ఇండియన్స్ కు షాక్ కు గురిచేసింది.
14 రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయిన హార్దిక్ సేనకు ఆ వెంటనే మరో షాక్ తగిలింది. కాసేపు ఊపు మీద కనిపించిన ఇషాన్(16) సైతం బర్గర్ బౌలింగ్ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇలా 3.3 ఓవర్లలోనే 20 పరుగులకు నాలుగు వికెట్లను ముంబయి ఇండియన్స్ చేజార్చుకుని కష్టాల్లో పడింది.