మహిళల అండర్-19 క్రికెట్ జట్టు ప్రపంచ విజేత(World Champion)గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో కప్పును ముద్దాడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ధాటికి 82కే ఆలౌటైంది. సూపర్ సిక్స్ మ్యాచులో సెంచరీ, 3 వికెట్లతో హడలెత్తించిన భద్రాచలం యువతి త్రిష.. ఫైనల్లోనూ సత్తా చాటింది. త్రిష 3, పరుణిక సిసోడియా 2, ఆయుషి శుక్లా 2, వైష్ణవి శర్మ 2 చొప్పున వికెట్లు తీసుకోవడంతో ప్రొటీస్ టీమ్ కోలుకోలేదు.
తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా టీమ్.. తొలి ఓవర్ నుంచే ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ త్రిష(44 నాటౌట్) ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. ఆమె స్పీడ్ కు తొలి 4 ఓవర్లలోనే 9 రన్ రేట్ తో 36 రన్స్ రాగా.. అందులో 6 ఫోర్లు త్రిషవే ఉన్నాయి. తన ఓపెనింగ్ జోడీ కమలిని(8) ఔటైనా, సనిక చల్కె(26 నాటౌట్)తో కలిసి మ్యాచును గెలిపించింది తెలుగమ్మాయి త్రిష. 11.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 84 స్కోరు చేసి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీమ్ఇండియా.