Published 25 Jan 2024
అండర్-19 ప్రపంచకప్(World Cup)లో భారత కుర్రాళ్లు దూసుకుపోతున్నారు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. పసికూన ఐర్లాండ్ ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.. తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. బ్లూమ్ ఫౌంటేన్ లో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 7 వికెట్లకు 301 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో అడుగుపెట్టిన ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా కుర్రాళ్లు 201 రన్స్ తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
రాణించిన ముషీర్, సహరన్…
టీమిండియా వన్ డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్(118) సెంచరీకి తోడు కెప్టెన్ ఉదయ్ సహరన్(75) నిలకడగా ఆడటంతో భారీ స్కోరు నమోదైంది. ఈ ఇద్దరు మినహా మిగతావాళ్లు పెద్దగా ఆడలేదు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ టీమ్ లో డేనియల్ ఫార్కిన్(27) హయ్యెస్ట్ స్కోరు. ఈ విజయంతో గ్రూప్-Aలో భారత అండర్-19 జట్టు రెండింటికి రెండు మ్యాచ్ ల్లో గెలిచి నాలుగు పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మొత్తం 16 టీమ్ లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడుతున్నాయి. తర్వాతి మ్యాచ్ ను భారత్ ఈ నెల 28న అమెరికాతో ఆడుతుంది.