ఓపెనర్ కిరణ్ నవ్ గిరె(Navgire) విధ్వంసం సృష్టించడంతో మహిళల ఐపీఎల్ లో ముంబయిపై UP వారియర్స్ ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన IPL ఆరో మ్యాచ్ లో టాస్ గెలిచిన UP.. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ముంబయి టీమ్ లో హేలీ మాథ్యూస్ తప్ప మిగతా వారంతా తొందరగా ఔటవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన యూపీ ప్రారంభం నుంచే దడదడలాడించింది. 17 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు సాధించి 7 వికెట్లతో గెలుపును సొంతం చేసుకుంది.
రాణించిన ఒకే ఒక్క బ్యాటర్…
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయికి హేలీ మాథ్యూస్(55; 47 బంతుల్లో 9×4, 1×6)దే అత్యధిక స్కోరు. యాస్తిక భాటియా(26), నాట్ సీవర్(19), అమేలియా కెర్(23), పూజా వస్త్రాకర్(18), ఇస్సీ వాంగ్(15) ఇలా ఎవరూ పెద్దగా స్కోర్లు చేయకుండానే ఔటయ్యారు. యూపీ నుంచి బౌలింగ్ కు దిగిన ఐదుగురూ తలో వికెట్ చొప్పున తీసుకున్నారు.
యూపీ వీరబాదుడు…
UP వారియర్స్ కు మొదట్నుంచీ శుభారంభమే లభించింది. ఇద్దరు ఓపెనర్లు కిరణ్ నవ్ గిరె(57; 31 బంతుల్లో 6×4, 4×6), కెప్టెన్ అలిసా హీలీ(33; 29 బంతుల్లో 5×4) వీరబాదుడులో టార్గెట్ క్రమంగా కరిగిపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే స్కోరు బోర్డు 10 రన్ రేట్ కు పైగా సాగింది. జట్టు స్కోరు 94 వద్ద మొదటి వికెట్ కోల్పోతే… ఆ వెంటనే మరో రెండు వికెట్లు పడ్డాయి. దీంతో 98కు చేరుకునేసరికి 3 వికెట్లు చేజారాయి. కానీ గ్రేస్ హారిస్, దీప్తి శర్మ జాగ్రత్తగా ఆడటంతో యూపీ విజయం ఖాయమైపోయింది.