పురుషుల సింగిల్స్ అత్యధిక టైటిళ్ల వీరుడు నొవాక్ జకోవిచ్.. మరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస సెట్లలో ప్రత్యర్థి డానిల్ మెద్వెదేవ్(రష్యా)ను చిత్తుగా ఓడించి US ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీని దక్కించుకున్నాడు. 6-3, 7-6 (7-5), 6-3తో ఈ సెర్బియా ఆటగాడు.. 2021లో తనను ఓడించి తొలి టైటిల్ గెలిచిన మెద్వెదేవ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో టెన్నిస్ అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరేట్ కోర్ట్(24)ను సమం చేశాడు. తొలి సెట్ ను ఈజీగా దక్కించుకున్న జకోకు రెండో సెట్లో గట్టి పోటీ ఎదురైంది. ఈ సెట్ మెద్వెదేవ్ గెలిచేలా కనిపించినా చివరకు జకోవిచ్ పుంజుకోవడంతో 6-6తో హోరాహోరీగా సాగింది. ఇది టైబ్రేకర్ కు దారితీయడం, అందులో సత్తా చూపించడంతో 7-6తో ఈ సెట్ సెర్బియా ఆటగాడి సొంతమైంది. గంటా 44 నిమిషాల పాటు రెండో సెట్ నడిచింది. ఇక చివరిదైన మూడో సెట్లోనూ గెలిచి US ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకున్నాడు. 3 గంటల 17 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది.
ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ కు వెళ్లిన జకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇప్పుడు US ఓపెన్ గెలుచుకున్నాడు. ఒక్క వింబుల్డన్ లో మాత్రం ఈ 36 ఏళ్ల జకో.. కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమి పాలయ్యాడు. నాలుగో US ఓపెన్ ను సొంతం చేసుకున్న జకో… ఇప్పటివరకు 10 ఆస్ట్రేలియన్ ఓపెన్, 7 వింబుల్డన్, 3 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. గతేడాదే ఈ రికార్డు ఖాతాలో వేసుకోవాల్సి ఉన్నా కొవిడ్-19 వ్యాక్సినేషన్ కు దూరంగా ఉండటంతో న్యూయార్క్ కు వెళ్లలేకపోయాడు.