గత కొద్ది నెలలుగా భారత క్రికెట్ జట్టు పెర్ఫార్మెన్స్ చూస్తే దారుణంగా తయారైందని వెటరన్ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. టెస్టు క్రికెట్ ను మినహాయిస్తే వన్డేలు, టీ20ల్లో అంచనాల్ని అందుకోవడం ఏనాడో మరచిపోయారన్నాడు. శనివారం వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేనే ఇందుకు ఎగ్జాంపుల్ గా మాట్లాడాడు. రోహిత్, విరాట్ కు రెస్ట్ ఇచ్చి బరిలోకి దింపిన జట్టు 6 వికెట్లతో ఓటమి పాలైన విషయాన్ని ప్రస్తావించాడు. ‘మనకు డబ్బుంది, అధికారం ఉంది.. అయినా ఛాంపియన్ స్థాయి జట్లకు దూరంగా ఉంటున్నాం.. కేవలం మామూలు విజయాలకే సంబరపడటం అలవాటు చేసుకున్నాం.. ప్రతి టీమ్ గెలవడానికి ఆడుతుంది.. అలాగే భారత్ కూడా గెలుపు కోసమే ఆడుతుంది.. కానీ టీమ్ ఇండియా ప్లేయర్ల విధానం, వైఖరి మాత్రం పేలవంగా సాగుతోంది’ అని ట్విటర్ ద్వారా తీవ్రస్థాయి కామెంట్లు చేశాడు.
భారత జట్టుకు మెయిన్ పేస్ బౌలర్ గా సేవలందించిన కర్ణాటక ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్.. గత కొంతకాలంగా టీమ్ ఇండియా సెలక్షన్, ఆటతీరును ప్రస్తావిస్తున్నాడు. జట్టులో సమన్వయం లోపించిందని, ఆటగాళ్ల థింకింగ్ లో మార్పు రావట్లేదని అంటున్నాడు.