విరాట్ కోహ్లి… దూకుడు(Aggressive)లోనే కాదు దుందుడుకు ఆటతీరులోనూ తానెంటో చూపించాడు.. చూపిస్తూనే ఉన్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచ్ లోనూ ఒంటరి పోరాటంతో సెంచరీ కంప్లీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్(International Level)లో టెస్టులు, వన్డేలు, T20లు కలిపి మొత్తం 26,733 పరుగులు చేసిన కింగ్ కోహ్లి… వన్డేల్లో 50, టెస్టుల్లో 29, T20ల్లో ఒక సెంచరీతో మొత్తం 80 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు IPL మెగా టోర్నీలోనూ అతడే టాపర్.
పరుగుల వీరుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ఈ ఢిల్లీ ప్లేయర్. 2008 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా IPL సీజన్లు ఆడుతూ 242 మ్యాచ్ లకు 234 ఇన్నింగ్స్ ల్లో 7,579 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోరు నిన్న రాజస్థాన్ పై చేసిన 113 రన్స్ కాగా.. స్ట్రైక్ రేట్ 130.62గా ఉంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 సెంచరీలు చేసిన కోహ్లి.. 52 అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత టోర్నీలో 5 మ్యాచ్ లాడి 316 రన్స్ తో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
అతడి తర్వాత…
కోహ్లితోపాటే 2008లోనే అరంగేట్రం(Entry) చేసిన శిఖర్ ధావన్ అతడి వెనకాలే 6,755 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక వార్నర్ 6,545… రోహిత్ శర్మ 6,280 మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. తొలి రెండు స్థానాల్లో ఉన్న ఇద్దరి మధ్య 834 రన్స్ తేడా ఉండటమే కోహ్లి టాలెంట్ కు నిదర్శనం. ఇందులో వార్నర్ 4 సెంచరీలు చేస్తే.. ధావన్ 2, రోహిత్ ఒక శతకం మాత్రమే నమోదు చేశారు. దీన్నిబట్టే కోహ్లికి మిగతా ప్లేయర్లుకున్న తేడా అర్థమవుతుంది.
ఒకే జట్టుకు…
IPLలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒకే జట్టు(రాయల్ ఛాలెంజర్స్)కు ఆడిన ఏకైక ఆటగాడన్న(The One And Only) ఘనత కూడా విరాట్ దే. 2016 సీజన్లోనైతే 973 రన్స్ చేశాడీ పరుగుల వీరుడు. ఫిట్ నెస్ పరంగా ప్రపంచ క్రీడాకారులంతా ఆరాధించే ప్లేయర్ ఇతడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆ రికార్డును అందుకునే ఏకైక ప్లేయర్ విరాటేనని ఇప్పటికే విశ్లేషకులు అన్నారు. 35 ఏళ్ల 154 రోజుల వయసులోనూ తనలో ఏ మాత్రం చేవ తగ్గలేదని నిరూపిస్తూ.. వచ్చే T20 వరల్డ్ కప్ కూ తానూ రెడీగా ఉన్నానంటూ సెలెక్టర్లకు మెసేజ్ పంపాడు విరాట్ కోహ్లి.