సున్నాకే తొలి వికెట్..
2 పరుగులకు 3 వికెట్లు..
మూడుకే 4… 14కే 6 వికెట్లు..
10 ఓవర్లలో స్కోరు 14..
అవి బుల్లెట్లా, బంతులా.. ఇన్నేళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఏనాడూ ఇంతటి ఆధిపత్యం లేదంటే ఆశ్చర్యం కాదేమో. స్కోరు బోర్డుపై పరుగుల స్థానంలో వికెట్ల సంఖ్య ఉంటే ఆ విధ్వంసం ఎలా సాగిందో తెలుస్తుంది. పరుగులు తీయడం పక్కనపెడితే కొద్దిసేపైనా క్రీజులో ఉండాలనుకున్నా క్షణ క్షణం గండంలా మారింది లంకకు. ముంబయి వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక భారత్ కు బ్యాటింగ్ ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో బాల్ కే రోహిత్ ఔటైనా గిల్, కోహ్లి, అయ్యర్ హాఫ్ సెంచరీలతో అదుర్స్ అనిపించారు. గిల్ 90లో.. కోహ్లి, శ్రేయస్ 80ల్లో అవుటయ్యారు. ఈ ముగ్గురి హాఫ్ సెంచరీలతో 50 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. 358 టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన లంక.. అందులో చివరి 58 పరుగులైనా చేస్తుందా అనిపించింది వారి ఆట చూస్తే. చివరకు అనుకున్నట్లే 19.4 ఓవర్లలో 55కే ఆలౌట్ అయి 302 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
లంక లబలబా
నిశాంక(0), కరుణరత్నే(0), మెండిస్(1), సమరవిక్రమ(0), అసలంక(1), మాథ్యూస్(12), హేమంత(0), చమీర(0).. ఇవి చూస్తే చాలు.. లంక గురించి చెప్పేదేం ఉండదనిపిస్తుంది. వికెట్లు తీయడాన్ని బుమ్రా స్టార్ట్ చేస్తే దాని వేగం పెంచాడు సిరాజ్. ఇక మహ్మద్ షమి అయితే వికెట్లు తీయడం ఇంత ఈజీయా అనిపించాడు. వికెట్ల వెనుక రాహుల్ వ్యవహరించిన తీరు పర్ఫెక్ట్ కీపర్ ను గుర్తు చేసింది. ఫోర్లు వెళ్లే వైడ్స్ ని డైవింగ్ చేసి ఆపడం, రివ్యూని పట్టుబట్టి అడిగి మరీ సక్సెస్ కావడం KL ఆటతీరుకు నిదర్శనంగా నిలిచింది. షమి మరోసారి 5 వికెట్లు తీసి తానేంటో చాటిచెప్పాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనే 14 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
ముగ్గురి హాఫ్ సెంచరీలు, షమికి 5 వికెట్లు
గిల్(92; 92 బంతుల్లో 11×4, 2×6), కోహ్లి(88; 94 బంతుల్లో 11×4), అయ్యర్(82; 56 బంతుల్లో 3×4, 6×6) హాఫ్ సెంచరీలతో దడదడలాడించారు. రోహిత్(0) ఔటైనా ఆ ప్రభావం కనిపించకుండా దూకుడుతో ఆడారు. రోహిత్ వికెట్ తీసుకున్న మధుశంక.. గిల్, కోహ్లి సహా 5 కీలక వికెట్లు పడగొట్టాడు. ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన శ్రేయస్.. 5 వికెట్లు పడ్డా సిక్స్ లు కొట్టడం ఆపలేదు. చివర్లో రవీంద్ర జడేజా(35; 24 బంతుల్లో 1×4, 1×6) ఫాస్ట్ గా రన్స్ చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
Wow..Great bowling