వెస్టిండీస్ తో మొదలైన తొలి టెస్టు(test)లో భారత జట్టు(Team India) హవా కొనసాగుతోంది. తొలుత బౌలర్లు విజృంభించడంతో విండీస్ తక్కువ స్కోరుకే ఆలౌట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా అదరగొడుతోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సత్తా చాటడంతో విండీస్ జట్టు పేకమేడలా కూలిపోయింది. అశ్విన్(5/60) ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. రవీంద్ర జడేజా(3/26) సైతం ప్రత్యర్థి జట్టును కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. దీంతో ఆ జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ జట్టులో ఎలిక్ అథనేజ్(47) మాత్రమే రాణించాడు. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ సహా అందరూ విఫలమయ్యారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలుత ఆచితూచి ఆడింది. కానీ తర్వాతే టపటపా వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. సిరాజ్, శార్దూల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్(40), రోహిత్(30) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో అశ్విన్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో తండ్రి, కొడుకులిద్దర్నీ ఔట్ చేసిన ఘనత సాధించాడు. 2011లో శివ్ నారాయణ్ చందర్ పాల్ ఔట్ చేసిన అశ్విన్… ఆయన తనయుడైన త్యాగ్ నారాయణ్ వికెట్ ని ఈ మ్యాచ్ లో తీసుకున్నాడు.