ఇప్పటికే రెండు టీ20ల్ని కోల్పోయి సిరీస్(Series) చేజార్చుకున్న వెస్టిండీస్… చివరి మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకుంది. విండీస్ బ్యాటర్లు వీరవిహారం చేయడంతో ఆస్ట్రేలియా బౌలర్లు అయోమయంలో పడ్డారు. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ ను కోల్పోయిన కరీబియన్లు.. చివరిదైన మూడో టీ20లో అద్భుత విజయం సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు… 6 వికెట్లకు 220 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా.. ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లకు 183 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో కంగారూలపై 37 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విండీస్… చివరి మ్యాచ్ లో గెలుపుతో ఇంటి దారి పట్టింది.
ధనాధన్ బ్యాటింగ్…
వెస్టిండీస్ తొలుత 17 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. జాన్సన్ ఛార్లెస్(4), కైల్ మెయర్స్(11), నికోలస్ పూరన్(1) త్వరత్వరగా ఔటయ్యారు. రోస్టన్ చేజ్(37), కెప్టెన్ రోమన్ పావెల్(21) ఫర్వాలేదనిపించారు. 79 రన్స్ కే ఐదు వికెట్లు కోల్పోయిన బాధలో ఉన్న సమయంలో మొదలైంది అసలు సునామీ. షెర్ఫాన్ రూథర్ ఫర్డ్(67; 40 బంతుల్లో 5×4, 5×6), ఆండ్రీ రస్సెల్(71; 29 బంతుల్లో 4×4, 7×6) ఫోర్లు, సిక్స్ ల వర్షం కురిపించారు. 25 బాల్స్ లో 50 మార్క్ దాటిన రస్సెల్.. మరో నాలుగు బంతుల్లో 21 రన్స్ రాబట్టాడు.
చేతులెత్తేసిన కంగారూలు…
విండీస్ బౌలింగ్ తో పెద్దగా ఇబ్బంది లేకున్నా కంగారూలు చేతులెత్తేశారు. వార్నర్(81; 49 బంతుల్లో 9×4, 3×6), టిమ్ డేవిడ్(41; 19 బంతుల్లో 2×4, 4×6) బాగా ఆడినా… మిగతా వారంతా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. మార్ష్(17), హార్దీ(16), ఇంగ్లిస్(1), మ్యాక్స్ వెల్(12) పెద్దగా ఆడలేదు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 183 వద్దే ఆగిపోయింది. అప్పటికి డేవిడ్, మాథ్యూవేడ్ క్రీజులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. రస్సెల్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, వార్నర్ కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కాయి. ఈ సిరీస్ ను 2-1తో ఆస్ట్రేలియా గెలుచుకుంది.