
టెస్టు సిరీస్ లో తక్కువ స్కోర్లకే(Low Scores) ఔటై తొలి వన్డేలోనూ అనుభవలేమిని కనబర్చిన వెస్టిండీస్ జట్టు.. తొలిసారి సత్తా చాటింది. రెండో వన్డేలో భారత్ ను తక్కువ స్కోరుకు కట్టడి చేసి 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు భారత్ ను 40.5 ఓవర్లలో 181 రన్స్ కు ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన విండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లకు 182 రన్స్ చేసింది. బ్రిడ్జిటౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్(55; 55 బంతుల్లో 6X4, 1×6) ఒక్కడే రాణించాడు. శుభ్ మన్ గిల్(34), సంజూ శాంసన్(9), అక్షర్ పటేల్(1), హార్దిక్ పాండ్య(7), సూర్యకుమార్(24), రవీంద్ర జడేజా(10) ఇలా అందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ పెద్దగా స్కోరు చేయకుండానే ఆలౌట్ అయింది. ఆ జట్టులో గుడకేశ్(3/36), షెఫర్డ్(3/37), జోసెఫ్(2/35) వికెట్లు తీసుకోగా.. మయర్స్, కేరియా తలో వికెట్ తీసుకున్నారు.
అయితే యువ జట్టు, పెద్దగా సీనియర్లు లేని విండీస్ ఆ మాత్రమైనా పోరాటం చేస్తుందా అన్న అనుమానాల నడుమ స్టేబుల్(Stable)గా రాణించింది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి తొలిసారి ఈ టూర్ లో గెలుపు రుచి చూసింది. ఓపెనర్లు కింగ్(15), మయర్స్(36) ఫర్వాలేదనిపించారు. కానీ షాయ్ హోప్(63; 80 బంతుల్లో 2×4, 2×6), కార్లీ(48; 65 బంతుల్లో 4×4) విజయం దిశగా నడిపించారు. భారత బౌలర్లలో శార్దూల్(3/42), కుల్దీప్(1/25) వికెట్లు తీశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన షాయ్ హోప్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు.