మన దేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ క్రికెట్ కోసం భారత జట్టును BCCI ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో చీఫ్ సెలెక్షన్ కమిటీ.. 15 మంది ప్లేయర్లతో కూడిన టీమ్ ను సెలెక్ట్ చేసింది. ఈ జట్టు రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే ప్రపంచ కప్ ఆడనుండగా.. హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తో కూడిన జట్టును BCCI ప్రకటించింది.
ప్రపంచకప్ లో ఆడే టీమ్ లను ఈ నెల 5 లోపు అన్ని దేశాలు ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు జట్ల ప్రకటన కోసం ICC గడువు ఇచ్చింది. తాజాగా ప్రకటించిన భారత జట్టులో ఏడుగురు బ్యాటర్లు, నలుగురు పేస్ బౌలర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు. ఈ అక్టోబరు 5 నుంచి భారత్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతాయి. చివరిసారిగా 2011లో భారత్ లో వరల్డ్ కప్ నిర్వహిస్తే.. శ్రీలంకపై ఫైనల్లో గెలిచి మన దేశం విశ్వవిజేతగా నిలిచింది. అక్టోబరు 14న అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ తలపడతాయి. అక్టోబరు 8 నాడు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ తో భారత్ జట్టు ప్రయాణం మొదలవుతుంది.