రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై పోరాటానికి మరోసారి రోడ్లెక్కుతామని ప్రకటించిన రెజ్లర్లు ఆదివారం రాత్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇక పోరాటం రోడ్లపై కాదు.. కోర్టులో అంటూ ట్వీట్ చేశారు. ‘మాకు న్యాయం జరిగే వరకు రెజ్లర్ల పోరాటం న్యాయస్థానంలో కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. సీనియర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ ఫునియా ఒకే రకం ట్వీట్ ను పోస్ట్ చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను WFI చీఫ్ పదవి నుంచి తొలగించాలంటూ రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం నాడు లాంగ్ మార్చ్ నిర్వహించి అరెస్టయ్యారు. ఆందోళనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. రెజ్లర్లను చర్చలకు పిలిచింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఆటగాళ్లతో చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు సరైన రెస్పాన్స్ రాకపోవడంతో మళ్లీ నిరసనకు దిగాలని నిర్ణయించినా.. చివరకు కోర్టులోనే తేల్చుకోవాలని తీర్మానించారు.