ఒక ఎండ్ లో రికార్డుల రాజు రోహిత్. బౌలర్లకు దడ పుట్టించేలా హార్డ్ హిట్టింగ్ చేసే రోహిత్ ను దాటి ఆడాలంటే ఎంతటి ప్రతిభ(Talent) ఉండాలి. వన్డేల్లోనే మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ సాధ్యం రికార్డును సొంతం చేసుకున్న రోహిత్ వంటి దిగ్గజం ముందు.. ఒక సిరీస్ లో కంటిన్యూగా రెండు ‘డబుల్’ లు సాధించడం మామూలు మాటలు కాదు. ఎప్పుడూ ధాటిగా ఆడి ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడే భారత కెప్టెన్ సైతం ఒక ఎండ్ లో నిదానంగా ఆడితే… మరో ఎండ్ లో ఉన్న ఆ చిన్నోడు మాత్రం బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఓపెనర్ గా తిరుగులేదన్నట్లుగా ఆడుతూ మాజీలను అబ్బురపరుస్తూ భారత జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్న ఆ కుర్రాడే యశస్వి జైస్వాల్. ఆడింది ఆరు టెస్టులే అయినా అతని రికార్డులు మామూలుగా లేవు మరి. అవేంటో చూద్దాం…
3 మ్యాచ్ ల్లో 545 రన్స్…
కెరీర్ లో ఆరు టెస్టులే ఆడినా ఎంతో అనుభవమున్న(Experience) ప్లేయర్ లా కనిపిస్తున్నాడు యశస్వి జైస్వాల్. హార్ట్ హిట్ ఓపెనర్ గా ముద్రపడ్డ రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తున్న ఈ చిన్నోడు ఇప్పటికే భారీగా పరుగులు రాబట్టాడు. ఎవరికీ అందనంతగా మూడు టెస్టుల్లో 545 పరుగులు చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక(Highest) సిక్స్ లు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు(World Record)ను సమం చేశాడు. పాకిస్థాన్ క్రికెటర్ వసీమ్ అక్రమ్(12) రికార్డును అందుకున్నాడు. ఇదొక్కటే కాదు.. ఇతడి ఘనతలు మరిన్ని ఉన్నాయి. ఇపుడు జరుగుతున్న సిరీస్ లో మూడు టెస్టుల్లోనే 545 పరుగులు చేసి టాపర్ గా ఉన్నాడు.
బ్యాటింగ్ భళా…
ఇంగ్లండ్ తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 80, రెండో ఇన్నింగ్స్ లో 15 రన్స్ తీశాడు. ఇక విశాఖలో జరిగిన సెకండ్ టెస్టులో అసలు ప్రతాపం చూపించాడు. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే 209 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 17 పరుగులే చేయగలిగాడు. రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 10 రన్స్ మాత్రమే చేసిన ఈ కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్ లో మరోసారి దుమ్ముదులిపాడు. 214 పరుగులతో నాటౌట్ గా నిలిచి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు జైస్వాల్.
తొలి భారతీయుడిగా…
జైస్వాల్ తన తొలి మూడు సెంచరీల్ని 150కి పైగా స్కోర్ల(171, 209, 214*)తోనే ముగించాడు. అత్యంత చిన్న వయసులో కంటిన్యూగా రెండు డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 22 ఏళ్ల 49 వయసులో జైస్వాల్ ఈ ఘనత అందుకుంటే.. వినోద్ కాంబ్లి, డాన్ బ్రాడ్ మన్ అతడి కంటే ముందున్నారు. 21 ఏళ్ల 54 రోజుల ఏజ్ లో కాంబ్లి, 21 ఏళ్ల 318 రోజుల వయసులో బ్రాడ్ మన్ రెండు డబుల్ సెంచరీలు చేశారు. వరుసగా రెండు ‘డబుల్’లు చేసిన మూడో భారతీయుడు యశస్వి. 1993లో జింబాబ్వేపై కాంబ్లి, 2017లో శ్రీలంకపై కోహ్లి ఇతడి కంటే ముందు ఆ ఘనత పొందారు.
సిక్స్ ల్లోనూ…
ఒక సిరీస్ లో టీమ్ఇండియా సాధించిన సిక్స్ లు 48. 2019లో సౌతాఫ్రికాపై బాదిన 47 సిక్స్ ల్ని ఈ సిరీస్(48) ద్వారా బ్రేక్ చేసింది రోహిత్ సేన. ఈ 48 సిక్స్ ల్లో 22 జైస్వాల్ బ్యాట్ నుంచి వచ్చినవే ఉన్నాయి. దీంతో ఒక టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ(19) పేరిట అత్యధిక సిక్స్ ల రికార్డును దాటాడీ చిన్నోడు. సర్ఫరాజ్ తో కలిసి 6.53 రన్ రేట్ తో 150 పార్ట్నర్ షిప్ నమోదు చేయడం కూడా ఏడో ఫాస్టెస్ట్ భాగస్వామ్యంగా నిలిచింది.