యువ సంచలనం యశస్వి జైస్వాల్ విశాఖ(Vizag) టెస్టులో చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే ‘డబుల్ సెంచరీ’ సాధించిన ఘనత(Credit)ను సొంతం చేసుకున్నాడు. శనివారం రెండో రోజు 179 పరుగుల వ్యక్తిగత స్కోరుతో గ్రౌండ్ లోకి దిగిన యశస్వి… అహో అనిపించేలా బ్యాటింగ్ కొనసాగించాడు. 180ల నుంచి 200కు చేరుకోవడానికి రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో డబుల్ సెంచరీ కల నెరవేరింది. ఇన్నింగ్స్ 100వ ఓవర్లో జైస్వాల్ 184 వ్యక్తిగత స్కోరు వద్ద సిక్సర్ బాది 190ల్లోకి ఎంటరయ్యాడు. అటు భారత్ సైతం వంద ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 360 స్కోరు చేసింది.
సూపర్ ‘డబుల్ సెంచరీ’…
యశస్వి జైస్వాల్ 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్లతో 200(Double Century) మార్క్ ను అందుకున్నాడు. 22 ఏళ్ల 36 రోజుల వయసులోనే ఈ చిన్నోడు ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. డబుల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడిగా జైస్వాల్ నిలిచాడు. ఇతడి కన్నా ముందు భారత క్రికెట్ చరిత్రలో సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లి ఈ ఘనత పొందారు.
వరల్డ్ క్రికెట్ లో మరో హిస్టరీ…
సహచర ఆటగాళ్ల(Team Mates)లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 34 అయితే జైస్వాల్ ఏకంగా డబుల్ సెంచరీని దాటాడు. ప్రపంచంలో ఈ రికార్డు అందుకున్న రెండో ప్లేయర్ గా ఈ కుర్రాడు నిలిచాడు. 2005లో జరిగిన అడిలైడ్ టెస్టులో వెస్టిండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో 34 పరుగులతో టీమ్ మేట్స్ లో అత్యధికంగా ఉన్న సమయంలో బ్రియాన్ లారా 226 రన్స్ చేశాడు. అలా లారా తర్వాతి స్థానాన్ని ఇన్నేళ్లకు యశస్వి ఆక్రమించాడు. చివరకు అతడు(209; 290 బంతుల్లో, 19×4, 7×6) పరుగుల వద్ద ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్ లో మరో షాట్ కు యత్నించి బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చాడు.
Published 03 Feb 2024