వన్డే వరల్డ్ కప్ కు ఇప్పటికే వెస్టిండీస్ దూరం కాగా ఇప్పుడు జింబాబ్వే సైతం దాన్ని ఫాలో అయింది. క్వాలిఫయర్స్ లో పోరాడినా ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. స్కాట్లాండ్ చేతిలో 31 రన్స్ తేడాతో ఓడి అనూహ్యంగా మెగా టోర్నీకి దూరమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్.. 8 వికెట్లకు 234 రన్స్ చేసింది. లియాస్క్(48), క్రాస్(38), మెక్ ములన్(34) అంతో ఇంతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్(3/43), చటారా(2/46) వికెట్లు తీసుకున్నారు. సొంతగడ్డపై ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఆడుతున్న జింబాబ్వే… విండీస్ లాంటి పెద్ద జట్టుపైనా అద్భుతంగా రాణించింది. సూపర్-6 తొలి మ్యాచ్ లోనే ఘన విజయం సాధించింది.
235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే… 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట్లోనే చతికిలపడ్డ జింబాబ్వే.. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మద్వీర(40), సికిందర్ రజా (34)తో కలిసి ర్యాన్ బర్ల్(83; 84 బంతుల్లో 8X4, 1X6) టీమ్ ను ఆదుకున్నాడు. బర్ల్ చివరి వరకు పోరాడినా తుది వికెట్ రూపంలో వెనుదిరగడంతో జింబాబ్వే కథ ముగిసింది.