రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ను మనకు కాకుండా చేసే కుట్రలను అడ్డుకునేందుకు తానే మొట్టమొదటి పాదయాత్ర చేపట్టానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జోగులాంబ తల్లికి దండం పెట్టి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టానన్నారు. గద్వాల జిల్లాలో భారాస భవనంతోపాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం ప్రారంభించారు. ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లా ఎన్నో కష్టాలకు నిలయంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.
నడిగడ్డలో విస్తృతంగా పర్యటించా
నడిగడ్డగా పిలుచుకునే అలంపూర్, గద్వాల ప్రాంతంలో రాష్ట్ర సాధన కోసం విస్తృతంగా పర్యటించానని కేసీఆర్ అన్నారు. ఆ సమయంలో దారుణమైన పరిస్థితులు కళ్లారా చూశానని, ఆ బాధలు చూడలేక కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత పరిపాలన సంస్కరణలు అమలు చేసుకుంటున్నామని, గతంలో పాలమూరు నుంచి వలస వెళ్లిన వారికి బదులుగా ఇప్పుడు పాలమూరుకే వలస వస్తున్నారని తెలియజేశారు. మీకు కరెంటు రాదు, తెలంగాణ చీకటిమయం అవుతుందని కొందరన్నారు.. ఇక్కడికి ఆంధ్ర కేవలం 25 కి.మీ. దూరంలోనే ఉంది.. ఇక్కడికి, ఏపీకి ఎంత తేడా ఉందో మీరే గమనించండి అంటూ ప్రజలకు సూచించారు.
ధరణిపై నోటికొచ్చినట్లు…
ధరణిపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, దాన్ని తీసివేస్తామని, బంగాళాఖాతంలో కలిపేస్తామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ధరణి కారణంగా రైతు బంధు నిధులు నేరుగా ఖాతాల్లో పడుతున్నాయి.. రైతు మరణిస్తే రూ.5 లక్షలు బ్యాంకులో జమ అవుతున్నాయి. మూడేళ్లు కష్టపడి ధరణి తీసుకువస్తే దాని గురించి రాద్ధాంతం చేస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు.