కేంద్ర ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పనిచేయనీయకుండా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. భాజపాయేతర ప్రభుత్వాల వెంటపడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. దిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్… కేసీఆర్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కాలరాసి ఆర్డినెన్స్ పేరిట పెత్తనం చెలాయించాలని మోదీ చూస్తున్నారని, వెంటనే ఆ ఆర్డినెన్స్ ను వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామన్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయన్న ముగ్గురు సీఎంలు… భాజపా సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) ద్వారా పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ పాలన సాగకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల మద్దతు కోసం కేజ్రీవాల్ హైదరాబాద్ చేరుకుని సీఎంతో సమావేశమయ్యారు.