అన్యాయానికి గురైన తమకు వెంటనే ఉద్యోగాలు(Jobs) ఇవ్వాలంటూ 2008 డీఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి నిరసన తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు సైతం ఉత్తర్వులు ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై రేవంత్ స్పందించాలంటూ అక్కడే నినాదాలు(Slogans) చేశారు. ఈ డీఎస్సీకి సంబంధించి కామన్ మెరిట్ పై వివాదం కొనసాగింది.
ఆ వివాదం కథ ఏంటంటే…
2008 డిసెంబరు 6న అప్పటి ఉమ్మడి AP సర్కారు 52,655 పోస్టులతో మెగా DSC ప్రకటించింది. ఇందులో SGT(Secondary Grade Teachers) పోస్టులు 30,558 ఉన్నాయి. మొత్తం SGT పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని చెప్పి ఇందుకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని తెలిపింది. కానీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని SGT పోస్టుల్లో 30 శాతం ఉద్యోగాలను DED అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29న జీవో 28ని తీసుకువచ్చింది. అలా 10,200 పోస్టులను DED అభ్యర్థులకే కేటాయించడంతో.. దీన్ని నిరసిస్తూ BED అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ముందుగా ప్రకటించినట్లు కామన్ మెరిట్ ప్రకారమే భర్తీ చేయాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సైతం ఇదే అభిప్రాయాన్ని తెలిపింది.
మళ్లీ రివర్స్…
కోర్టు ఆదేశాలతో పాత నోటిఫికేషన్ ప్రకారమే కార్యక్రమం కొనసాగాలంటూ 2010 జూన్ 21న జీవో 27ను తీసుకువచ్చింది. దీని ప్రకారం కౌన్సిలింగ్ ప్రారంభమై క్యాండిడేట్ లిస్టును జిల్లాల వారీగా అధికారులు ప్రకటించారు. దీనిపై DED అభ్యర్థులు పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తే కౌన్సిలింగ్ ను నిలుపుదల చేయిస్తూ ‘స్టే’ వచ్చింది. 30 శాతం కోటా కల్పిస్తూ కొత్త మెరిట్ లిస్టును 2010లో ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో వందలాది మంది ఎదురుచూపులకు పరిమితమయ్యారు.
విచారణ ఇలా…
DED అర్హత మాత్రమే అవసరమైన SGT పోస్టులకు అంతకంటే ఎక్కువ ఎలిజిబిలిటీ కలిగినవారు పోటీపడకుండా నిరోధించడం రాజ్యాగ విరుద్ధమని కోర్టులో వాదోపవాదాలు నడిచాయి. డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం కోటా ఇవ్వడం చట్టబద్ధమా, కాదా అన్న విషయం జోలికి తాము వెళ్లడం లేదంటూ వారంతా ఇప్పటికే 12 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నారని 2022 సెప్టెంబరులో కోర్టు గుర్తు చేసింది. ఆ 30 శాతం కోటాలో మిగిలిపోయిన పోస్టులను అర్హులైన బీఈడీ అభ్యర్థులకు మెరిట్ ప్రకారం ఇవ్వాలని స్పష్టం చేస్తూ తుది తీర్పునిచ్చింది.
1 thought on “2008 డీఎస్సీ అభ్యర్థులు భారీగా ప్రజాభవన్ కు… Demand For Recruitment”