15 సంవత్సరాల ఎదురుచూపులకు కాంగ్రెస్ సర్కారు తెరదించడంతో 2008 DSC అభ్యర్థుల్లో పట్టరాని సంతోషం కనిపిస్తున్నది. ఇంతకాలం అన్నిరకాలుగా నష్టపోయిన అభ్యర్థులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్(MTS) పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తూ మంత్రివర్గం(Cabinet) నిర్ణయం తీసుకోవడంతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడిందన్న ఆనందం అభ్యర్థుల్లో కనిపించింది. మంగళవారం నాడు మంత్రులు ఈ విషయం ప్రకటించగానే పెద్దయెత్తున సంబరాలు చేసుకున్నారు.
పొద్దున్నుంచి రాత్రి వరకు…
అయితే కేబినెట్ మీటింగ్ లో ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న కుతూహలంతోనే అభ్యర్థులంతా పొద్దున్నుంచి రాత్రి వరకు కాలం గడిపారు. 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలిస్తున్నట్లు ప్రకటించగానే.. ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకున్నారు. నిర్ణయం కోసం వేచిచూస్తూ రాత్రి దాకా సచివాలయం(Secretariat)లోనే ఉన్న అసోసియేషన్ ప్రతినిధులు.. ప్రకటన రాగానే ఒకరికొకరు సంతోషం పంచుకున్నారు. CM రేవంత్ రెడ్డితోపాటు మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
గైడ్ లైన్స్ కోసం…
తమకు ఉద్యోగాలిస్తున్నామని ప్రకటించగా అందుకు సంబంధించిన విధివిధానాల్ని(Guidelines) వెంటనే ఖరారు చేయాలని 2008 DSC సెలక్టెడ్ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. దశాబ్దంన్నర కాలంగా తీవ్రంగా నష్టపోయామని ఇప్పుడు ఇస్తున్న మినిమమ్ టైమ్ స్కేల్(MTS)పై ఆనందంగా ఉన్నా త్వరగా గైడ్ లైన్స్ రూపొందించాలని అభ్యర్థించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని గుర్తు చేసుకున్నారు.