కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో ఉపశమనం(Relief) లభించకపోవడంతో ఇక ఆయన అరెస్టు తప్పదా అన్న మాటలు వినపడుతున్నాయి. ఫార్ములా ఈ-కార్ రేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఇక దర్యాప్తు సంస్థలు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. పిటిషన్ కొట్టివేత, రెండు దర్యాప్తు సంస్థల నోటీసులపై తాజాగా ఆయన తన లీగల్ టీంతో చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది.
ఇప్పటికే ACB రెండు సార్లు నోటీసులివ్వగా, అటు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్(ED) సైతం విచారణకు పిలిచింది. ఈరోజు ED విచారణ జరగాల్సి ఉండగా, కోర్టు తీర్పు దృష్ట్యా వాయిదా కోరారు. అటు ACB విచారణకు తొలిసారి హాజరుకాకపోవడంతో రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 9న తమ ముందుకు రావాలంటూ నోటీసుల్లో తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులో చుక్కెదురు కావడంతో ఇక KTR విషయంలో ACB ఏం చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.