దసరా తర్వాతే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలన్న యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు కనపడుతోంది. అక్టోబరు లేదా నవంబరులో మెయిన్స్ నిర్వహించే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో టీఎస్పీఎస్సీ ఊపిరి పీల్చుకుంది. మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని త్వరలోనే వెబ్ సైట్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తుది కీ విడుదల, మూల్యాంకనాన్ని వేగవంతం చేసి ఫలితాలు వెల్లడించాలని చూస్తోంది. కనీసం మూడు నెలల సమయం ఇచ్చి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. రద్దయిన గత పరీక్షతో పోలిస్తే.. ఆదివారం జరిగిన ప్రిలిమ్స్ కు దాదాపు 50 వేల మంది తగ్గారు.
10 మంది సిబ్బందికి నిర్బంధ సెలవు
కమిషన్ ఉద్యోగులు ఎవరైనా పరీక్షలకు హాజరైతే వారిని నిర్బంధ సెలవులో పంపించాలని కమిషన్ నిర్ణయించింది. గ్రూప్-1కు 10 మంది అప్లై చేయగా.. వారిని పరీక్ష తేదీకి రెండు నెలల ముందు, పరీక్ష తర్వాత నెల పాటు సెలవులో పంపించింది. మిగతా పరీక్షలకు ఇదే పద్ధతి అవలంబించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అభాసుపాలైన దృష్ట్యా.. కమిషన్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.