కేసుల విషయంలో నిర్లక్ష్యం(Neglegence)గా వ్యవహరించి నిందితులకు సహకరిస్తూ అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో చేసి చూపించారు హైదరాబాద్ పోలీసు కమిషనర్(Commissioner Of Police) కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఏకంగా పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయిస్తూ అందులో ఉన్న సిబ్బందినంతా బదిలీ(Transfer) చేశారు. ఇలా హైదరాబాద్ CP.. సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ పోలీసు శాఖకు గుబులు తెప్పించారు.
SI నుంచి హోంగార్డు వరకు…
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బదిలీలు చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. ఇక్కడ SI నుంచి హోంగార్డు వరకు ఏ ఒక్కరూ స్టేషన్ లో ఉండేందుకు వీలు లేకుండా అందరికీ స్థాన చలనం కల్పించారు. ఇటీవలే ప్రజాభవన్ ను కారుతో ఢీకొట్టి డివైడర్లను బద్ధలు కొట్టిన కేసులో బోధన్ మాజీ MLA షకీల్ తనయుడు సాహిల్ ను పోలీసులు తప్పించారని విచారణలో తేలింది. ఈ ఘటనలో బోధన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ తోపాటు పంజాగుట్ట CI దుర్గారావును సస్పెండ్ చేశారు. బోధన్ CIని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. దుర్గారావుపైనా కేసు ఫైల్ చేశారు. మాజీ MLA షకీల్ తోపాటు ఆయన కొడుకు సాహిల్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇద్దరు ఇన్స్ పెక్టర్లపై కఠినంగా…
మొన్నటి డిసెంబరు 23న అర్థరాత్రి సాహిల్ అలియాస్ రాహిల్.. అతివేగం(Over Speed)తో కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసులో సాహిల్ ను తప్పించేందుకు డ్రైవర్ అబ్దుల్ అసిఫ్ ను ఇరికించాలని చూశారు. అదే అర్థరాత్రి నిందితుణ్ని గుట్టుగా అక్కణ్నుంచి పంపించివేశారు. దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ కాగా.. అప్పటి CI దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. సీఐని సస్పెండ్ చేయడంతోపాటు కేసు పెట్టారు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటా పరిశీలిస్తే బోధన్ CI బాగోతం వెలుగుచూసింది. బోధన్ నుంచి నిజామాబాద్ ట్రాన్స్ ఫర్ అయినా ఇంకా జాయిన్ కాని CI ప్రేమ్ కుమార్ ను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఇద్దరు CIలపై కఠిన చర్యలు కొనసాగుతున్న టైమ్ లో పంజాగుట్ట ఠాణా సిబ్బంది మొత్తాన్ని కదిలించడం హాట్ హాట్ గా మార్చింది.