కొత్త రేషన్ కార్డుల విషయంలో సందేహాలు(Doubts) ఏర్పడ్డ వేళ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇక ఆన్లైన్(Online) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త కార్డులతోపాటు పేర్లను చేర్చడం, మార్పు, అడ్రస్ వంటి వాటికి ‘మీ సేవా’ కేంద్రాల్లోనే అప్లై చేసుకోవాలి. ఇందుకోసం అన్ని కేంద్రాల్లో ఆన్లైన్ విధానాన్ని అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా గల సెంటర్లలో ఏర్పాట్లు చేయాలని ‘మీ సేవా’ కమిషనర్(ESD)కు పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల సమగ్ర వివరాల్ని(Database) ‘మీ సేవా’ కేంద్రాలకు అందివ్వాలని స్టేట్ ఇన్ఫర్మేటిక్స్ ఆఫీసర్ కు సైతం సూచించారు.
ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా అసలైన లబ్ధిదారులకే కొత్త కార్డులు అందుతాయని, డూప్లికేట్ అప్లికేషన్లను అక్కడికక్కడే గుర్తించే వీలుంటుందని సివిల్ సప్లయిస్ విభాగం స్పష్టం చేసింది. అయితే కొత్త కార్డుల దరఖాస్తులకు నిర్దిష్ట గడువంటూ ఏం లేదని, ఎప్పుడైనా చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. గ్రామసభలు, ప్రజాపాలన ప్రత్యేక కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటి దృష్ట్యా ఇక మీ-సేవా ద్వారా అప్లికేషన్లు తీసుకోవాలని సర్కారు ఆదేశించింది.