
Published 29 Jan 2024
అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారంలా.. సర్వరోగ నివారిణిగా తయారైన రేషన్ కార్డును కేవలం రేషన్ కోసమే పరిమితం చేయబోతున్నారా…?
ఆరోగ్యశ్రీ కింద వైద్యం(Treatment) చేయించుకోవాలంటే ఇక నుంచి రేషన్ కార్డు అవసరం లేదా…?
ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు ఉండాలన్న నిబంధనపై సడలింపు ఇవ్వబోతున్నారా…?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం త్వరలోనే దొరకబోతున్నది. స్వయంగా ముఖ్యమంత్రి(Chief Minister) రేవంత్ రెడ్డే ఈ విషయంపై ఉన్నతాధికారులను క్లారిటీ కోరడంతో ఇక రేషన్ కార్డు విషయంలో అతి త్వరలోనే ఏదో ఒకటి తేలిపోయే అవకాశం ఏర్పడింది. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు. బడా వ్యక్తులు సైతం కార్డులు తీసుకోవడంతో ఆ సంఖ్య పెద్దయెత్తున పెరిగిపోయింది. కాబట్టి దీనిపై సమాలోచనలు(Thinking) చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కోసమే రేషన్ కార్డు తీసుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ వైపుగా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై సమీక్ష(Review) నిర్వహించిన CM.. తెల్ల కార్డులపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు.
మొత్తం కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం(NFSA) కింద 54.39 లక్షలుంటే అందులో 1.94 కోట్ల మంది పేర్లున్నాయి. ఇక రాష్ట్ర ఆహార భద్రతా కార్డులు 35.59 లక్షలైతే 91.30 లక్షల లబ్ధిదారులున్నారు. ఇలా మొత్తంగా 2.85 కోట్ల మందికి రేషన్ కార్డుల్లో పేర్లుంటే వీరి శాతం రాష్ట్ర మొత్తం జనాభాలో 71.5గా ఉంది. ఇక కార్డుల్లో కొత్త పేర్లు చేర్చాలంటూ 11 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటన్నింటినీ కలిపితే లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లకు చేరుకుని బీదలు 75% దాటిపోతున్నారు. కానీ ఇందులో 9.90 లక్షల కార్డుదారులు అసలు రేషనే తీసుకోవడం లేదు. అంటే రేషన్ తీసుకోనివారి శాతం 11గా ఉంది. ఆరోగ్యశ్రీ, ఇతర స్కీమ్ ల కోసమే కార్డులు తీసుకున్నారని ఎప్పుడో నిరూపితమైంది.
పంచాయతీలకు అప్పగిస్తే చాలు…
నిజానికి అసలైన లబ్ధిదారులకే గనుక తెల్ల రేషన్ కార్డులు చేర్చే కార్యక్రమం మొదలైతే.. ఇపుడున్న వాటిలో 40 నుంచి 50 శాతం కార్డులు కొట్టుకుపోతాయి. కార్డుల జారీలో ఒక విధానాన్ని పాటించకపోవడం, అనుకున్నవారికల్లా ఇప్పించుకోవడం వల్లే లక్షల సంఖ్యలో తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఒకవైపు రెండు పూటలా భోజనం దొరకనివారు ఎందరో ఉంటే.. వచ్చిన బియ్యాన్ని వాడుకోలేని వారు లక్షల్లో ఉన్నారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది తీక్షణ దృష్టిసారిస్తే గనక అక్కడికక్కడే అనర్హులు తేలిపోతారు. కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఆ పని చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.