కరీంనగర్ రేకుర్తిలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. దాన్ని పట్టుకునేందుకు ఫారెస్టు అధికారులు గంటల పాటు కష్టపడ్డారు. అది పట్టణంలోకి రాగానే జనంలో ఆందోళన ఏర్పడింది. దీంతో తెల్లవారుజాము వరకు రేకుర్తి వాసులు జాగారం చేయాల్సి వచ్చింది. వలలతో ఎలుగు బంటిని బంధించేందుకు ఫారెస్టు సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా తప్పించుకుంటూ వారికి అందకుండా పోయింది. దాని కోసం రోడ్లపైన పరుగులు పెట్టారు. చివరకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కొద్ది దూరం వెళ్లాక దాన్ని పట్టుకున్నారు. కాలనీలో ఎలుగుబంటి పరుగులు పెట్టడంతో స్థానికులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో ఎలుగుబంటి కొద్ది దూరం పారిపోయి స్పృహ తప్పి పడిపోయింది. అయితే బంధించిన ఎలుగుబంటిని అడవిలో వదిలిపెడతామని అధికారులు చెబుతున్నారు.
రేకుర్తి గుట్టల్లో రెండు నుంచి మూడు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు ఫారెస్టు సిబ్బంది అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం శాతవాహన యూనివర్సిటీ సమీపంలోకి కూడా ఎలుగుబంటి రావడంతో గందరగోళం ఏర్పడింది. కరీంనగర్ చుట్టూ గల కొండల్లో తవ్వకాలు జరుపుతుండటం వల్ల మూగజీవాలు జనాల్లోకి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.