అసలే ఎన్నికల కాలం… ఎండాకాలం. ఈ సీజన్లో బీర్ల(Beers)కు ఎక్కడలేని గిరాకీ. చల్లని బీర్ తాగి రిలాక్స్ అవుదామనుకునే మందుబాబులకు ప్రస్తుతం పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇందుకు కారణం.. బీర్లకు భారీగా కొరత ఏర్పడటమే. ఎంతలా అంటే మద్యం ప్రియులు తట్టుకోలేనంతగా. కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో(Liquor Shops)నైతే 15-20 రోజుల నుంచి బీర్లే దొరకడం లేదు.
సమ్మర్ డిమాండ్…
IML(Indian Made Liquor)తో పోల్చితే మార్చి నుంచి మే వరకు బీర్లు ఎక్కువగా అమ్ముడవుతాయి. అందుకనుగుణంగా కంపెనీలు సైతం భారీగా ఉత్పత్తి(Production) చేస్తాయి. మళ్లీ జూన్-జులై నెలల్లో బీర్ల అమ్మకాలు తగ్గి IML సేల్స్ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకునే భారీస్థాయిలో బీర్లను తయారు చేస్తారు.
కారణమదేనా…!
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. బీర్ల ఉత్పత్తి తగ్గిపోయిందా లేక ఉన్న బీర్లను ఎన్నికల కోసం పక్కదారి పట్టించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణ రోజుల కన్నా ఎన్నికల వేళ ప్రత్యేకంగా స్టాక్ లు పెట్టాల్సింది పోయి వైన్స్ ల్లో నో స్టాక్ అని చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.