
దక్షిణ మధ్య రైల్వే మరో 3 ‘భారత్ గౌరవ్ రైళ్ల’ను నడపనుంది. ‘పూరీ-కాశీ-అయోధ్య’కు భారత్ గౌరవ్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఇటీవలి ట్రిప్ ల ద్వారా IRCTCకి 100 శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో ఈ టూర్లకు శ్రీకారం చుడుతోంది. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను దర్శించుకునేలా టూరిస్ట్ ట్రెయిన్స్ నడపనుంది. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ క్షేత్రాల్ని దర్శించుకునేలా ఏర్పాట్లుంటాయి. ఈ యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 రోజులు సాగుతుంది.

సికింద్రాబాద్ నుంచి స్టార్ట్…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ జూన్ 28, జులై 12, జులై 26 తేదీల్లో మూడు ట్రెయిన్స్ బయల్దేరతాయి. దేశంలోని తూర్పు, ఉత్తర భాగంలోని ముఖ్యమైన తీర్థస్థలాలను చుట్టివచ్చేలా యాత్ర సాగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ, ఏపీల్లో 8 చోట్ల ఈ రైళ్లు ఆగుతాయి. తెలంగాణలో కాజీపేట, ఖమ్మం… ఏపీలో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఆగనుంది. రైలు, రోడ్డు రవాణా సహా వసతి సౌకర్యాలతోపాటు ఈ యాత్రలో భోజన ఏర్పాట్లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్ ల సేవలు, అన్ని కోచ్ లలో సీసీ కెమెరాలు, అనౌన్స్ మెంట్ ఫెసిలిటీ, ప్రయాణ బీమా వంటి సౌకర్యాలుంటాయి. బుకింగ్ వివరాల కోసం http://www.irctctourism.com/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

టూర్ సాగేది ఇలా…
సికింద్రాబాద్-పూరీ-కోణార్క్-గయ-వారణాసి-అయోధ్య-ప్రయాగ్ రాజ్.
మొదటి రైలు… 28-06-2023 నుంచి 06-07-2023 వరకు
రెండో రైలు… 12-07-2023 నుంచి 20-07-2023 వరకు
మూడో రైలు… 26-07-2023 నుంచి 03-08-2023 వరకు
టికెట్ ధరలు
ఒక్కొక్క టికెట్ ధర… ఎకానమీ కేటగిరీ(స్లీపర్ క్లాస్) రూ.15,075(జీఎస్టీ సహా)
ప్రామాణిక వర్గం(3 ఏసీ) రూ.23,875
కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ) రూ.31,260