రాష్ట్రంలో MLAల పార్టీ ఫిరాయింపు వ్యవహారం BRS నుంచి పక్కకు మళ్లి.. BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కమలం పార్టీ MLAలపై చేసిన కామెంట్స్ తో BJP శాసనసభాపక్ష నేత కౌంటర్ ఇచ్చారు. తమ కేంద్ర నాయకత్వం దృష్టిసారిస్తే రాష్ట్ర కాంగ్రెస్ లో ఒక్కరూ ఉండరంటూ ఎదురుదాడి చేశారు.
అసలేం జరిగిందంటే…
BRS నేతలే కాకుండా కమలం పార్టీ లీడర్లు సైతం తమతో టచ్ లో ఉన్నారంటూ నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొద్దిగా దృష్టిపెడితే ఆ ఎమ్మెల్యేలు కూడా మాతో వస్తారంటూ మాట్లాడారు. దీనిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయిదుగురు రాష్ట్ర మంత్రులు తమ పార్టీ కేంద్ర నాయకత్వం(High Command)తో టచ్ లో ఉన్నారని ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడమే కాకుండా ఆయనతో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారని గుర్తు చేశారు. ఒకవేళ కాంగ్రెస్(Congress) పార్టీ గనుక BJP MLAలపై దృష్టిపెడితే కమలం పార్టీ సైతం హస్తంపై కన్నేస్తుందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
పొన్నం సైతం…
మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇవన్నీ పనికిమాలిన మాటలని, కావాలంటే దృష్టిపెట్టండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. ఇప్పటికే BRS నుంచి కె.కేశవరావు, కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతల వలసలతో రాజకీయ గందరగోళం ఏర్పడ్డ వేళ ఇలా కమలం-హస్తం పార్టీ లీడర్ల మాటల తూటాలు ఆసక్తికరంగా మారాయి.