ఫ్రీ కరెంటుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా BRS నాయకులు, కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో రోడ్లకు మీదకు వచ్చి బైఠాయించారు. కటిక చీకట్లో కాంగ్రెస్ కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ ఎదుట MLC కల్వకుంట్ల కవిత బైఠాయించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరుపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు KTR సైతం రేవంత్ రెడ్డి మాటలపై మండిపడ్డారు. రైతులకు మూడు పూటలా కరెంటు ఎందుకంటున్న కాంగ్రెస్ ను ఇంకా నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. మనసున్న KCR కావాలా.. దగా చేసే రాహుల్ కావాలా అంటూ మాట్లాడారు.
ఉచిత కరెంటు ఎత్తివేతకు హస్తం పార్టీ ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తోందని BRS విమర్శించింది. అన్ని జిల్లాల్లోనూ మంత్రుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నేషనల్ హైవేలపై ధర్నాలు చేస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో వాహనాల ట్రాన్స్ పోర్టేషన్ ఆగిపోయింది.