ప్రజలకు ఉపయోగపడేలా విధానాలు రూపొందించడం, వాటిని పేదలకు చేరువ చేయడమనేది సివిల్ సర్వీసెస్ అందిస్తున్న అత్యుత్తమ మార్గమని BC సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. సివిల్ సర్వీసెస్ సాధించడం తన జీవితంలో అత్యంత మధురఘట్టమని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే అత్యున్నతమైన సర్వీసును సాధించాలన్న టార్గెట్ ను చిన్నతనం నుంచే అలవాటు చేసుకోవాలని, గమ్యాన్ని చేరుకునేవరకు విశ్రమించకూడదని అభ్యర్థులకు సూచించారు. తాజా సివిల్స్ విజేతలతో ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ముఖాముఖి ప్రోగ్రాంకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
బీసీ గురుకులంతోపాటు OUలోనే చదివి ఎన్నో కష్టాలను ఎదుర్కొని సివిల్స్ సాధించానని, నాలాంటి ఎంతోమంది పేదరికాన్ని జయించి ధైర్యంగా సివిల్స్ సాధించడాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలన్నారు. గురుకులాల్లో చదివినవారు ఈ ఏడాది సివిల్స్ టాపర్స్ లో ఉండటం అభినందనీయమని వెంకటేశం అన్నారు. టాలెంట్ ఉన్నవారిని గుర్తించి తమ సంక్షేమ శాఖ స్వయంగా సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. సివిల్స్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ ఉమాహారతి, 35వ ర్యాంకర్ సాకేత్ కుమార్, 60వ ర్యాంకర్ సాయి ప్రణవ్, 94వ ర్యాంకర్ సాయికృష్ణతోపాటు సివిల్స్ విజేతలు మహేశ్ కుమార్, రేవయ్య, ప్రణీత్, హిమవంశీ, అపూర్వ ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.