ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. దీంతోపాటు రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ రెండింటినీ వేర్వేరుగా జారీ చేయాలని నిర్ణయించింది.
కొత్త రేషన్ కార్డుల కోసం మంత్రివర్గ ఉపసంఘం(Sub-Committee) ఏర్పాటు కానుంది. దీంతో ఇక త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఉంటారు. రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు(Guidelines) రూపొందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.