విద్యాసంవత్సరం(Academic Year) ప్రారంభం కాబోతున్న వేళ సర్కారీ బడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ఆధునికీకరణ(Modernization) కోసం పెద్దయెత్తున నిధులు వెచ్చించాలని నిర్ణయించింది. బడుల్లో మౌలిక వసతుల(Infrastructure) కల్పనతోపాటు విద్యావ్యవస్థలో మార్పులు చేపట్టనున్నట్లు మంత్రులు పొంగులేటితోపాటు శ్రీధర్ బాబు తెలియజేశారు.
నిధులు ఇలా…
పాఠశాలల ఆధునికీకరణ కోసం రూ.600 కోట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా బడుల నిర్వహణ చేపట్టాలని, ఇందుకోసం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం(Sub Committee)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. ఈ అమ్మ ఆదర్శ కమిటీలు గత మార్చి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నా ఎన్నికల కోడ్ వల్ల ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు.
జాయింట్ అకౌంట్ తో…
పాఠశాల హెడ్ మాస్టర్ తోపాటు మహిళా మండలి కమిటీకి జాయింట్ గా అకౌంట్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, మరమ్మతులు తదితర నిర్వహణకు సంబంధించిన పనులు చేపట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. ఎన్నికల వల్ల ఇప్పటిదాకా ఇవి సందిగ్ధంలో ఉండగా.. ఇప్పుడివి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు సర్కారు సంకల్పించింది. మొత్తంగా జూన్ 12 నాటికి స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నామని మంత్రులు వివరించారు.