కొత్త జోన్లు, నూతన జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు కోసం తెచ్చిన 317 జీవోపై.. కేబినెట్(Cabinet) సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన ఈ భేటీలో మరో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
317 జీవోలో స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ(GAD).. తాజాగా కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచింది. ప్రతిపాదించిన అంశాలను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి.. రాష్ట్ర అడ్వకేట్ జనరల్(AG)తో సంప్రదించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. AGతో సంప్రదింపులు ముగిసిన తర్వాత తుది నివేదికను తమ ముందుంచాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీంతోపాటు జీవో 46కు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతోనూ కమిటీ చర్చించింది. పాత జిల్లాల వారీగానే సర్వీస్, ప్రమోషన్ అంశాలను లెక్కలోకి తీసుకోవాలని మొన్నటి భేటీలో నిర్ణయించారు. వెబ్ పోర్టల్ ద్వారా అందిన అప్లికేషన్లు మొత్తం 52,235 ఉంటే.. అందులో విద్యాశాఖ నుంచి 20,209, హోంశాఖ నుంచి 11,417 అప్లికేషన్లు ఉన్నాయి.